- రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంటు నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- కాకినాడలో 495 ఎకరాల్లో ఏర్పాటు..2,600 మందికి ఉద్యోగాలు
- ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్కో గ్రూప్ నకు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా… ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం గమనార్హం. ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కాకినాడలో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అమరావతి నుంచి కాకినాడకు వెళ్లి 11.20 గంటలకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
రూ.13 వేల కోట్ల పెట్టుబడులు… 2,600 ఉద్యోగాలు
గ్రీన్ హైడ్రోజను ఉపయోగించి కార్బన్ ఉద్గారాలు లేకుండా పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే గ్రీన్ అమోనియాను ఏఎమ్ గ్రీన్ సంస్థ. ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది. ఇది పర్యావరణానికి ఏమాత్రం హానికరం కాదు. ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్ ను గ్రీన్ ప్లాంట్గా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏఎమ్ గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 2027 చివరినాటికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎగుమతులకు అద్భుత అవకాశం
ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్టు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీనివల్ల గ్రీన్ అమోనియాను అవసరమైన ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉండనుంది. ఏఎమ్ గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనివర్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 కేటీపీఏ గ్రీన్ అమోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది. అలాగే మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్కు చెందిన జీఐసీ, యూఏఈకి చెందిన ఏడీఏఐ వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది, ఈ ప్రాజెక్టుతో పాటే కాకినాడలోనే రూ.2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను కూడా: ఏఎమ్ గ్రీన్ ఏర్పాటు చేస్తోంది.















