హైదరాబాద్ (చైతన్యరథం) ఎన్టీఆర్ కు మరణం లేదని.. సూర్య చంద్రులు ఉన్నంత వరకూ ఆయన తెలుగుజాతి గుండెల్లో సజీవంగా ఉంటా రని ఆయన తనయుడు, ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఆయన నివాళు లర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, తది తరులు ఎన్టీఆర్కు నివాళులర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరం.. అవి ఎన్టీఆర్లో ఉండేవి. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లూ ఆయన బతికే ఉంటారు. సినిమాల్లో ఎవరూ చేయని పాత్రలు ఎన్టీఆర్ చేశారు. ప్రతిపాత్రలోనూ పరకాయ ప్రవేశంతో నటనలో ఎన్నో ప్రయోగాలు చేశారు. టీడీపీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. కొంతమందికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ చేర్చారు. బడుగు, బలహీన వర్గాలకు చేయూత అందించారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వించేలా చేశారు. పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు ఆయన. అప్పట్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలవుతున్నాయి. ప్రజల వద్దకు పాలనను చేరువ చేశారు. తెలుగు గంగ, గాలేరు నగరిలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయన స్ఫూర్తిని టీడీపీ కొనసాగిస్తోందనిబాలకృష్ణ అన్నారు. నంద మూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు వారి గుండెచప్పుడు, కళామతల్లి ముద్దు బిడ్డ ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన ఎన్నో సేవలు అందించారన్నారు. తెలుగుజాతి ఔన్నత్యా న్ని ప్రపంచానికి చాటారని చెప్పారు.














