- ఐబీఎం, గూగుల్ క్లౌడ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీలు
- ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేలా రౌండ్ టేబుల్ సమావేశాలు
దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం పర్యటన రెండోరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడులు ఆకర్షించడం, ఆధునిక సాంకేతికత, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. మంగళవారం ఉదయం నిర్వహించే సీఐఐ బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ’ అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఎదిగిన విధానం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పోర్ట్ ఆధారిత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల నైపుణ్యంపై వివరించనున్నారు. ఆ తర్వాత జరిగే ఇండియా లౌంజ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, ప్రపంచ పెట్టుబడిదారులతో పరస్పర చర్చలు జరపనున్నారు. అనంతరం దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తోనూ సీఎం సమావేశం కానున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తిలతో సీఎం కొద్దిసేపు సమావేశం అవుతారు. సాయంత్రం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్, జెఎస్‌డబ్ల్యూ సిమెంట్స్, పెయింట్స్ సంస్థల ఎండీ పార్ధ్ జిందాల్‌తోనూ సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మేర్స్క్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్‌తో సీఎం ముఖాముఖి సమావేశం అవుతారు. పలువురితో జరిగే వన్ టు వన్ సమావేశాలకు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా హాజరు కానున్నారు. విజన్ టు వెలాసిటీ- డెప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. అలాగే “వన్ ఫ్యామిలీ — వన్ ఎంటర్‌ప్రెన్యూర” కార్యక్రమంపై ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు గ్లోబల్ కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారు.













