- నీటి యాజమాన్య పద్ధతులపై దిశా నిర్దేశం
- జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు వెల్లడి
అమరావతి (చైతన్యరథం): నీటి భద్రత, నీటి క్యాలెండర్, భూగర్భ జలాల పెంపు వంటి నీటి యాజమాన్య విధానాలపై ఈ నెల ఆఖరున సాగునీటి సంఘాల అధ్యక్షులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ సమావేశం సమర్థ నిర్వహణకు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాటర్ పాలసీలపై సాగునీటి సంఘ అధ్యక్షులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఈ నెల ఆఖరి వారంలో అమరావతిలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. 5ఏళ్ళ వైసీపీ పాలనలో అన్ని రంగాల కంటే సాగు నీటి రంగమే తీవ్ర విధ్వంసానికి గురైందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి నిర్వహణలో రైతు ప్రాతినిధ్యం లేకుండా సాగు నీటి సంఘాలను జగన్ పూర్తిగా నిర్వీర్యం చేశాడని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్నారు. సాగునీటి సంఘాలకు పూర్వ వైభవం కల్పించి రైతులను భాగస్వాములను చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైసిపి పాలనలో సాగునీటి సంఘాలు లేక, రైతుల ఇబ్బందులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని నిమ్మల పేర్కొన్నారు. సాగు నీటి సంఘాలు లేకపోవడంతో నిర్వహణ కరువై నీటివనరులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఆరేళ్ళ అనంతరం నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించామన్నారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికి, కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. సాగు నీటి సంఘాల ద్వారా రైతులు వారికి వారే సేవ చేసుకునేలా దాదాపు 60 వేల మందికి సాగు నీటిరంగంలో ప్రాతినిధ్యం కల్పించాం. ఇది నిజమైన అన్నదాతల ప్రభుత్వంగా అభివర్ణించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, కడా కమిషనర్ ప్రశాంతి, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎసఈలు, ఈఈలు పాల్గొన్నారు.













