జ్యూరిచ్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): ఫుడ్ సెక్యూరిటీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అంతర్జాతీయంగా 140 దేశాల్లో సప్లయ్ చైన్ ఇంటిగ్రేషన్ కలిగి ఉన్న బ్యూలర్ గ్రూప్ (Buhler group) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు, బ్యూలర్ ఇండియా ఛైర్మన్ దీపక్ మానేతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జ్యూరిచ్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో బ్యూలర్ ఫుడ్స్, గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పైలట్ ట్రయల్స్, ప్రొడక్ట్ లోకలైజేషన్ ద్వారా ఏపీలోని అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లకు మద్దతు నివ్వండి. బ్యూలర్ మిల్లెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్యస్థాయి ప్రదర్శన, స్కేలప్ సౌకర్యంగా మార్చడానికి సహకారం అందించండి. మిల్లెట్ ఆధారిత ఆహార పరిశ్రమ అభివృద్ధితోపాటు మెరుగైన దిగుబడులు, ఎక్స్‌పోర్ట్ రెడీ న్యూట్రిషన్‌కు మీ సహకారం ఊతమిస్తుంది. బ్యూలర్ మేక్-ఇన్-ఇండియా ఆప్టికల్/కలర్ సార్టర్ తయారీని అసెంబ్లీ, టెస్టింగ్ లేదా కాంపోనెంట్ లోకలైజేషన్ ద్వారా విస్తరించండి. ఇది మా రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనతోపాటు స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తుంది. బ్యూలర్ గ్లోబల్ అప్లికేషన్, ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) మోడల్‌తో ఆంధ్రప్రదేశ్ లో బ్యూలర్ ఫుడ్ ప్రాసెసింగ్ స్కిల్ డెవలప్ సెంటర్‌ను ఏర్పాటు చేయండి. ఇది ప్లాంట్ ఆపరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ పార్కులు, అగ్రి-ఇండస్ట్రియల్ కారిడార్లకు మద్దతు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలో అగ్రగామి అగ్రి-ఫుడ్ హబ్‌గా మార్చడానికి మీ వంతు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. బ్యూలర్ ఇండియా ఛైర్మన్ దీపక్ మానే మాట్లాడుతూ… భారత్‌లో బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ దక్షిణాసియాకు మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, కస్టమర్ డెలివరీకి ప్రధాన హబ్‌గా పనిచేస్తుందని చెప్పారు. బెంగుళూరు క్యాంపస్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్, రైస్ ప్రాసెసింగ్, బిస్కట్స్, డ్రైయర్స్, కాఫీ రోస్టింగ్ తయారీ, ఆప్టికల్ సార్టింగ్ సేవలను ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థకు భారత్‌లో వడోదర, హైదరాబాద్, రాయపూర్, కాకినాడల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. కాకినాడ బ్రాంచ్ రీజనల్ సేల్స్, లైఫ్ సైకిల్ సర్వీస్ నోడ్‌గా పనిచేస్తున్నదని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా కస్టమర్ ఇంటర్ ఫేస్, సర్వీస్ కోఆర్డినేషన్, స్పేర్స్ ఫెసిలిటేషన్ అందిస్తుందని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని దీపక్ మానే పేర్కొన్నారు.












