- ఏడాది క్రితం ఉద్యమంలా ప్రారంభించాం
- ఇందులో భాగంగా రూ.573 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
- ప్రజలందరూ భాగస్వాములు కావాలి
- మార్చిలోగా మరో 70 స్వచ్ఛ రథాలు
- వచ్చే ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు
- చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
నగరి (చైతన్యరథం): స్వచ్ఛాంద్ర అనేది మన జీవన విధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో శనివారం స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్థాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లతో పాటు మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ సన్మానించారు. అనంతరం ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నగరిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏడాది క్రితం ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించాం. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు… ఇది మన జీవన విధానం.. జీవితంలో ఒక భాగం కావాలి. అందుకే ప్రతి నెలా 3వ శనివారం నాతో సహా నేతలు, అధికార యంత్రాంగం హాజరవుతున్నాం. సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా జన్మభూమి, పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం రూ.573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులను రూ.510 కోట్లతో చేపడుతున్నాం. హౌస్ హోల్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం రూ.2.21 కోట్ల విలువైన 9,048 హోం కంపోస్టింగ్ బిన్ను మెప్మా ఆర్పీలకు అందించాం. గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0 కింద రూ.6.7 కోట్లతో 200 ఈ- ఆటోలు, 12,000 ట్రైసైకిళ్లు, 5,000 పుష్కార్స్ట్ సిద్ధం చేశాం. గతేడాది నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద విస్తృతంగా పరిశుభ్రతా డ్రైవ్లు చేపట్టాం. లెగసీ వేస్ట్ తొలగింపులో రికార్డులు సృష్టించాం. పట్టణాల్లో ఇప్పటి వరకు 105 లక్షల మెట్రిక్ టన్నుల పాత చెత్త తొలగించాం. గ్రామీణ ప్రాంతాల్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను క్లియర్ చేస్తున్నాం. మార్చి 2026 నాటికి లెగసీ వేస్ట్ తొలగింపులో 100 శాతం లక్ష్యం చేరుకుంటాం.
పట్టణాలో 97.26 శాతం ఇళ్ల నుంచి డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ చేస్తుండగా, అన్ని పంచాయతీల్లో వ్యర్ధాల సేకరణ జరుగుతోంది. 62 శాతం ఇళ్లకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ఈ మార్చి నాటికి పంచాయతీలు, పట్టణాల్లో 100 ఇళ్ల నుంచి డోర్ టు డోర్ కలెక్షన్ ఉంటుంది. వచ్చే నెలలో కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను పీపీపీ మోడల్లో చేపడుతున్నాం. రెండేళ్లలో ఇవి ఉత్పత్తి మొదలు పెడతాయి. విజయవాడ, తిరుపతికి కూడా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే ప్రజలకు డంపింగ్ యార్డ్ సమస్య ఉండదు. కాలుష్యం కూడా తగ్గుతుంది. సంపద తయారీ కేంద్రాలను 10,790 వరకు ఏర్పాటు చేశాం. స్వయం సహాయ సంఘాల భాగస్వామ్యంతో కంపోస్ట్ తయారవుతోంది. దాన్ని రైతులకు సరఫరా చేస్తాం. స్వచ్ఛ రథాలతో మీ ఇళ్లలోని డ్రై వేస్ట్, ప్లాస్టిక్, కాగితాలు వంటివి తీసుకుని నిత్యావసరాలు ఇస్తున్నాం. ఇప్పటివరకు 30 స్వచ్ఛరథాలు ఉన్నాయి. మరో 70 మార్చి నాటికి ప్రవేశ పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ
ప్రజలందరి సహకారంతో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తయారుచేయాలని సంకల్పించాం. 2018లోనే ఓడిఎఫ్ రాష్ట్రంగా ఏపిని నిలిపాం. ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్ రాష్ట్రంగా ఈ మార్చికి తీర్చిదిద్దుతాం. రాష్ట్ర సచివాలయంతో సహా 17 పట్టణ, నగరపాలక సంస్థల కార్యాలయాలు ఇప్పుడు పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపేశాయి. ఈ ఘనత సాధించిన విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, పాలకొండ, రాజాం, బొబ్బిలి, సత్తెన్నపల్లి, కుప్పం, చిత్తూరు, మార్కాపురం, సాలూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, పుంగనూరు, పలమనేరు మున్సిపల్ కార్యాలయాలను అభినందిస్తున్నాను. ఐటీసీ సంస్థ భాగస్వామ్యంతో వెల్ బీయింగ్ అవుట్ అఫ్ వేస్ట్ అనే కార్యక్రమం కింద పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో పరిశు భ్రత, క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యంగా ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ-వేస్ట్ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటుచేసి 47 పట్టణ ప్రాంతాల నుంచి 30 టన్నుల ఈ-వేస్ట్ ఇప్పటి వరకు సేకరించాం. 13 నగరాల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా 71 భారీ సర్వీసింగ్ మిషిన్లు వినియోగిస్తున్నాం. రోజుకు 108 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి కోసం 20 పట్టణ ప్రాంతాల్లో 33 ప్లాంట్లు చేపడుతున్నాం. త్వరలో మరో 82 ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం. పుత్తూరు, నగరిలో సూటికి నూరు శాతం డ్రైన్స్ పూర్తి చేస్తాం. 111 గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం జరుగుతోంది. 4 ఏళ్లలో 26 వేల కి.మీ. మ్యాజిక్ డ్రెయిన్లను గ్రామాల్లో నిర్మించి మురుగు నీటి సమస్యను పరిష్కరిస్తాం. రాష్ట్రంలో హోమ్ కంపోస్టింగ్, కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్ల సంఖ్య పెరిగింది. వీటిని మరింతగా విస్తరించి 2026 మార్చి నాటికి 10 లక్షల కుటుంబాలు ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆచరించేలా ప్రోత్సహిస్తాం. సర్క్యులర్ ఎకానమీలో దేశానికి ఏపీ దారి చూపుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.
కుప్పం తరహాలో నగరి అభివృద్ధి
నగరి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. నా మిత్రుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అనునిత్యం నగరి ప్రజల కోసం తపించేవారు. నగరిలో ఆ ఐదేళ్లూ అభివృద్ధి అంటే తెలియదు. ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. 2029 ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగే ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లకుండా పరిశ్రమలు తీసుకొస్తాం. కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం ప్రజావేదిక సభలో పీశ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు వచ్చిన మార్గదర్శులను సీఎం సన్మానించారు. పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు గాలి భాను ప్రకాశ్ నాయుడు, ఎంపీ డి.ప్రసాదరావు తదితర నేతలు హాజరయ్యారు.















