- ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి చేస్తాం
- క్రెడిట్ చోరీ అంటున్న వారికి ఏం క్రెడిట్ ఉంది?
- ఐదేళ్ల రాక్షసపాలనతో రాష్ట్రం అతలాకుతలం
- నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నాశనమే
- నేడు సుపరిపాలనతో రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు
- ల్యాండ్ టైట్లింగ్ లాంటి దుర్మార్గపు చట్టాన్ని
- రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాం
- చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు
నగరి (చైతన్యరథం); నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో ఐదేళ్ల వైసీపీ పాలనలో చూశామని, మంచి-చెడుకి తెలుసుకోవాలని వ్యత్యాసం ఏంటో ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో శనివారం స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల అనంతరం ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రం అతలాకుతలమైందని, ప్రజలు మాట్లాడాలన్నా.. నవ్వాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సుపరిపాలనతో పరిస్థితులను చక్కదిద్దుతున్నామన్నారు. 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయంటే.. సమర్థ పాలనకు నిదర్శనమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు..
రాక్షస పాలన నుంచి విముక్తి
ఐదేళ్ల వైసీపీ రాక్షస పాలన వల్ల రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాం. 94 శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించాం. గత పాలనలో అమరావతిపై మూడు ముక్కలాట ఆడారు. శ్మశానం, ఎడారి అన్నారు. ఇప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ అంటున్నవారికి అసలు ఏం క్రెడిట్ ఉంది? రాజధానిపై విషం చిమ్ముతున్నారు. నాపై నమ్మకంతో 29 వేల మంది రైతులు 33 వేలు ఎకరాల భూమి రాజధాని కోసం ఇచ్చారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. అడ్డంకులు సృష్టించినా అమరావతిని అడ్డుకోలేరు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. అనాడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించాను. నేడు అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి. వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాలను ప్రగతిపథంలో నడిపిస్తాం. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. పేదల సేవలో, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2, అన్నదాత సుఖీభవ వంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
సమర్థ నాయకత్వం ఉంటేనే..
సమర్థ నాయకత్వం ఉంటే ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. చెడు చేసినవారిని గుర్తుపెట్టుకుని.. మంచి చేస్తున్నవారిని ప్రోత్సహించాలి. ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పా. హామీకి కట్టుబడి ఉన్నా. భవిష్యత్లో కరెంట్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నాను. యూనిట్ కి 39 పైసలు ఖర్చు తగ్గించాం. గత ప్రభుత్వంలో రూ.32 వేల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారు. రూ.1.20 లక్షల కోట్లు అప్పులు పెట్టారు. నేడు రూ.4,600 కోట్ల ట్రూప్ అఫ్ ఛార్జీలు వేస్తే వాటిని ప్రభుత్వమే భరిస్తోంది. మూడేళ్లలో కరెంటు కొనుగోలు ధరను కూడా గణనీయంగా తగ్గిస్తాం. గతంలో చెడు ఆలోచనలు పెట్టుకుని నేరస్థులు రాజకీయాలు చేసి రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేశారు. ఆ పరిస్థితిని చక్కదిద్దుతున్నామని సీఎం తెలిపారు.
ప్రజల భూమికి భద్రత కల్పించాం
భూమి అంటే ప్రజలకు సెంటిమెంట్. అలాంటి భూమికి గత ప్రభుత్వంలో భద్రత లేకుండా చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, 22 ఏ అక్రమాలతో ప్రజలతో వికృత క్రీడ ఆడారు. సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై ఫొటోలు వేసుకోవడం కోసం రూ. 700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ సమస్యలు పరిష్కరించాం. రాజ ముద్రతో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేలా పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను సర్వ నాశనం చేసింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రాయలసీమను రాళ్ల సీమగా మార్చారు. పోలవరం డయాఫ్రమ్ వాల్న గోదావరిలో కలిపేశారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేస్తాం. గోదావరి జలాలు సీమకు వస్తే నీటి సమస్య ఉండదు. గత ప్రభుత్వంలో కేంద్ర నిధులను పక్కదారి పట్టించారు. కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారు. జల జీవన్ మిషన్లో రూ. లక్ష కోట్లు వాడుకునే అవకాశం ఉన్న అసమర్థతతో వదిలేశారు. రాష్ట్రమంతా గంజాయిని ప్రోత్సహించి యువత భవిష్యత్ను నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈగల్ వ్యవస్థతో గంజాయిపై ఉక్కుపాదం మోపాము. గత పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన బకాయిలను కూటమి అధికారంలోకి రాగానే విడతల వారీగా చెల్లించాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన వారిని ఏం చేయాలి? తాత్కాలిక ప్రయోజనాల కోసం చెడు వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుంది. నేను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి త్వరలో 50 ఏళ్లు పూర్తవుతోంది. క్రమశిక్షణతో, విలువలతో కూడిన రాజకీయమే చేస్తున్నా అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.














