- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి
- ఏప్రిల్ 11న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన
- అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ల ఏర్పాటు
- అవసరమైన చోట్ల బీసీ స్టడీ సర్కిళ్ల నిర్మాణం
- త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుదిరూపం
- పలు బీసీ సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత భేటీ
విజయవాడ (చైతన్యరథం): అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనం నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ 11వ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పూలే స్మృతి వనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లు నిర్మించనున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లు లేనిచోట్ల నూతన స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో ఐదెకరాల్లో రాష్ట్ర స్థాయి. బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో పలు బీసీ సంఘాల నేతలతో విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత శనివారం సమావేశమయ్యారు. 19 నెలల కూటమి పాలనలో బీసీల అభ్యున్నతికి అమలు చేసిన పథకాలతో పాటు త్వరలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. ఏయే పథకాలు అమలు చేస్తే బీసీలకు మరింత ఆర్థిక దన్ను లభిస్తోందో సంఘాల వారీగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను మంత్రి సవిత దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, టీడీపీతోనే బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ గుర్తింపు లభించిందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. మహిళలకు, బీసీలకు పాలనలో భాగస్వాములను చేసిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీలను అక్కున చేర్చుకున్నారన్నారు. బీసీ కుల వృత్తిదారులకు భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబునాయుడు ఆదరణ, ఆదరణ 20 అమలు చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో, త్వరలో రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పూలే 200వ జయంతి భారీ ఎత్తున నిర్వహించనున్నామన్నారు. అదే రోజు జ్యోతిరావు పూలే స్మృతి వనానికి సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నామన్నారు. అమరావతిలో ఐదెకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ బీసీ స్టడీ సర్కిల్ కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టనున్నామన్నారు.
త్వరలో బీసీ రక్షణ చట్టం
బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా బీసీల ఆత్మగౌరవానికి భంగం కలగనీయకుండా త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ చట్ట రూపకల్పనకు తుది రూపు ఇస్తున్నట్లు తెలిపారు. బీసీలకు మేలు చేసేలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం వల్ల ఎక్కువగా లబ్ధి పొందించి బీసీ బిడ్డలేనన్నారు. బీసీ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ బిడ్డల సాంకేతిక విద్య కోసం కంప్యూటర్ లేబ్ లు ఏర్పాటు చేశామన్నారు. బీసీ యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలన్న లక్ష్యంతో సివిల్ సర్వీసెస్, మెగా డీఎస్సీ కోసం ఉచిత కోచింగ్ అందజేశామన్నారు. ప్రస్తుతం రెండో విడత బ్యాచ్ కు సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నామన్నారు.
డెడికేషన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
డీఎస్టీ కులాలకు గుర్తింపు కార్డులు అందజేయాలని మంత్రి సవిత దృష్టికి బీసీ సంఘాల ప్రతినిధుల తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఈ అంశం ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు దృష్టిలో ఉందని, డీఎన్జీ కులాల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుల గణనకు త్వరలో డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారానికే ఈ సమావేశం నిర్వహించినట్లు మంత్రి సవిత స్పష్టంచేశారు. ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు యరసాని నాగేశ్వరరావు, వై.నూకాలమ్మ, ఎల్.వెంగళరావు, ఏ. ఆదిశేషు, వీరవల్లి శ్రీనివాసులు, బత్తుల రమణయ్య, పి. జయప్రకాశ్, ఏ.వరప్రసాద్ యాదవ్, బి.వెంకటరమణరాజు, ఎస్.గోపాల్, ఎస్.నాగరాజు, అవుల శ్రీరశేఖర్ యాదవ్, పూసల రవి, జె. శ్రీనివాస్ గౌడ్, డి.మల్లికార్జునరావు, టి.చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.














