- పదవుల్లో సమర్థులకు పెద్దపీట
- ప్రజలతో మమేకమై పనిచేయాలి
- పనితీరు బాగాలేకుంటే పక్కనపెడతా
- చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి
- తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి
- కార్యకర్తలకు సముచిత గుర్తింపు
- నాయకులెవరూ వారిని విస్మరించొద్దు
- గతంలో కంటే పది శాతం ఓట్లు పెరగాలి
- పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): మరింత శక్తితో, ఉత్సాహంతో పనిచేసేందుకు టీడీపీని యువరక్తంతో నింపుతున్నామని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. రానున్న అన్ని ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించేలా నేతలు, కార్యకర్తలు రెట్టించిన పౌరుషంతో ముందుకు కదలాలని పిలుపు ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…పార్టీ ఎప్పటికప్పుడు మరింత సమర్థవంతంగా పని చేసేలా రోజురోజుకూ బలోపేతం కావాలన్నారు. అందుకే పార్టీలో యువరక్తానికి ప్రాధాన్యం ఇచ్చాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై శాతం మంది కొత్తవారికి, చదువుకున్న వారికి ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించాం. దేశంలోనే యంగ్ పార్లమెంట్ కలిగిన పార్టీగా టీడీపీ నిలిచింది. సమర్థులకు పెద్ద పీట వేశాం. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాం. పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలను పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు సమన్వయం చేసుకోవాలి. పార్టీ కార్యక్రమాలు ఎవరు బాగా నిర్వహిస్తున్నారో నివేదికలు తెప్పిస్తాం. పొలిటికల్ గవర్నెన్స్‌లో పార్లమెంట్ కమిటీ కీలకం. పార్లమెంట్ పరిధిలో చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పార్లమెంట్ అధ్యక్షులతో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రజలతో మమేకం కావాలి
పార్టీలో ఎవరికి ఏ పదవిచ్చినా కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నాం. మీరు సమర్థవంతమైన నాయకులుగా తయారవ్వడానికి ఇదొక వేదిక. పార్లమెంట్ అధ్యక్షులకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుంది. మంత్రులు కూడా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలి. కూటమిలోని జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. 2024లో ఎన్నికల్లో కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకు పది శాతం ఓట్లు అదనంగా సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 ఎన్నికలకంటే కూటమి నేడు మరింత బలోపేతమైంది. ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు వెళ్లడం కాదు… ప్రభుత్వం చేసే కార్యక్రమాలను వివరిచేందుకు వారితో మమేకం కావాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
పార్టీయే సుప్రీం
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు..ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కనబెడతా. పార్టీ సిద్ధాంతానికి అందరూ కట్టుబడి పని చేయాలి. వచ్చిన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత నాయకత్వం, శ్రేణులపై ఉంది. పార్టీలో కార్యకర్తే…అధినేత. ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగినప్పుడే నాయకులుగా మీరు, మీతో పాటు పార్టీ శాశ్వతంగా ఉంటుంది. టీడీపీ ఒక కుటుంబం. గత ప్రభుత్వంలో కార్యకర్తలు కష్టాలు పడ్డారు..ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పసుపు జెండా కోసం రక్తం చిందించారు. అనేక త్యాగాలు చేశారు. ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి…కార్యకర్తల ద్వారానే జరగాలి. నాయకులెవరూ కేడర్‌ను విస్మరించవద్దు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలతో అనుసంధానం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు.
చేసిన మంచి చెప్పుకోవాలి
ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారే పని చేయాలి. కావాలని ఎక్కడైనా వివాదాలు సృష్టిస్టే పక్కనబెడతాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ విధానాలకు అనుగుణంగా పని చేయాలి. ఆర్థికేతర సమస్యల్లో రెవెన్యూ పెద్ద సమస్య. ఎన్నికల ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే రద్దు చేశాం. లోపభూయిష్టమైన ఆ చట్టాన్ని గత ప్రభుత్వంలో తెచ్చారు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఎక్కడా చెప్పుకుండా హైకోర్టుకు మాత్రమే వెళ్లాలని చెప్పారు..ఇది సామాన్యులకు సాధ్యమేనా? ప్రభుత్వంలోని వ్యక్తులకు కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అధికారాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజల జుట్టు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. పట్టాదారు పాసుపుస్తకాలపై వారి ఫోటోలు ముద్రించుకున్నారు. పొలం సరిహద్దు రాళ్లపై వాళ్లు ఫోటోలు, పేర్లు ముద్రించుకున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా? వాళ్లు అడిగిన భూములు ఇవ్వకపోతే 22 ఏలో పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి అన్ని ఆయుధాలు ఉపయోగించారు. అందుకే మళ్లీ సర్వేలు చేసి సమస్యలు లేకుండా ఏడాదిలో పట్టాదారు పుస్తకాలు ఇస్తాం. మనం చేసింది చెప్పుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.
మాటలు మార్చడమే వారి క్రెడిట్
మాట్లాడితే క్రెడిట్ చోరీ అంటూ అసత్యాలు వల్లిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయానికి గతంలో మన ప్రభుత్వం 2,500 ఎకరాలు కేటాయిస్తే అందులో 500 ఎకరాలు కొట్టేయాలని చూశారు. మనం వచ్చాక మళ్లీ విమానాశ్రయం పనులు పరుగున పెట్టిస్తూ ఈ జూన్‌కు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. పవిత్రమైన తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారు. పాలు లేకుండానే నెయ్యి తెచ్చారు. దాన్ని కూడా సమర్థించుకుంటున్నారంటే ఏం చేయాలి? అమరావతి రాజధానిగా అభ్యంతరం లేదని అసెంబ్లీలో చెప్పారు. తర్వాత అడుగడుగునా అడ్డం పడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు..3 ముక్కలాటాడారు. ఇప్పుడు మళ్లీ మనం రాజధానికి జీవం పోశాం. అమరావతే మనకు రాజధాని. అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయం. కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మళ్లీ ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అదే రాజధాని అంటున్నారు. రాజకీయాల్లో ఉండేవారికి స్టెబిలిటీ, స్థిరత్వం ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి
వెలిగొండ ప్రాజెక్టుకు నాడు నేనే శంకుస్థాపన చేశాను. కానీ తర్వాత వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా. కుప్పంలో హంద్రీనీవా నీరు తెస్తున్నామని డ్రామా ఆడారు. మరుసటి రోజు గేటు ఎత్తుకుపోయారు. వెలిగొండను కూడా పూర్తి చేయకుండా జాతికి అంకితం చేసినట్లుగా ప్రజలను మోసగించారు. మనం చేసే పనులు ఎంత ముఖ్యమో తప్పుడు ప్రచారాన్ని ఎక్కడిక్కడ తిప్పి కొట్టడం అంతే ముఖ్యం. సోషల్ మీడియా, మీడియాలోనే కాదు…మౌత్ టు మౌత్ కూడా చెప్పాలి. అప్పుడే అందరిలో క్లారిటీ వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.
అభివద్ధి, సంక్షేమం టీడీపీ విధానం
టీడీపీకి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. ఏ ఊర్లో ఏం చూసినా మనం చేసిన అభివృద్ధే కనబడుతుంది. మనం చేసిన సంక్షేమాన్ని చెబుతారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తున్నాం. సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలున్నా అందిస్తున్నాం. స్త్రీ శక్తి ద్వారా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తున్నాం. దీపం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులను ఆదుకుంటుంటున్నాం. సీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చుతున్నాం. ప్రధాని మోదీ కూడా అనంతపురం ఆదర్శవంతమైన జిల్లా అని చెప్పారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
పనిచేయకపోతే పక్కన పెడతా
డబ్బులతోనే రాజకీయం చేయలేం… నమ్మకం ఉండాలి. డబ్బుతోనే అన్నీ నడుస్తాయనుకుంటే డబ్బులున్న వాళ్లే రాజకీయం చేస్తారు.. మన లాంటి వాళ్లు చేయలేరు. ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం జరిగినా కార్యకర్తలు దానికి బాధ్యత తీసుకోవాలి. డీఎస్సీ నిర్వహణలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా అనుకున్న సమయానికే 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చాం. 6 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేశాం. శిక్షణలో వారి స్టైపండ్ కూడా రూ.4,500 నుంచి రూ.12 వేలకు పెంచాం. ప్రజలపై విద్యుత్ భారం తగ్గించాం… మరింతగా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. కూటమి వచ్చే నాటికి రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. నేడు రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దుతున్నాం. పదవులు తీసుకున్న వారి పనితీరు 3 నెలలకు ఒకసారి చూస్తా… సరిగా చేయకపోతే పక్కనబెట్టి మరొకరికి అవకాశం కల్పిస్తాం. పార్టీలో తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నేతలు, కార్యకర్తల్లో కూడా మార్పులు రావాలి. రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో గెలిచేలా నేతలు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు.














