- ఏపీ మత్స్య, వ్యవసాయరంగాలకు ఎంతో ప్రయోజనం
- మంత్రి నారా లోకేష్ హర్షం
అమరావతి (చైతన్యరథం): ఇండియా- యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతించారు. భారతదేశ ప్రపంచ వాణిజ్య చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం, ఒక పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. ఈ ఒప్పందం.. భారత పరిశ్రమలను అత్యంత వేగవంతంగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించే వ్యూహాత్మక విజయం. ఈయూ మార్కెట్లకు ప్రాధాన్యతతో కూడిన ప్రవేశం వల్ల ఏపీలోని మత్స్య, వ్యవసాయ ఉత్పత్తుల వంటి అనేక రంగాలకు తక్షణ ప్రయోజనం కలుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా 75 బిలియన్ డాలర్ల ఎగుమతుల మార్కెట్‌కు బాటలు పడతాయి. తద్వారా ఎంఎసఎంఈలు, మహిళలు, చేతివృత్తులవారు, యువత, నిపుణులకు పెద్దఎత్తున ప్రోత్సాహం లభిస్తుంది. ఇండియా`ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ఈ చారిత్రాత్మక మైలురాయి ఒప్పందం కుదరటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయన్‌లకు మంత్రి లోకేష్ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.














