- పాదయాత్ర ద్వారా సమాజం నుంచి ఎంతో నేర్చుకున్నా
- కూటమి ప్రభుత్వం వచ్చాక యువతకు 4లక్షల ఉద్యోగాలు కల్పించాం
- అభివృద్ధి వికేంద్రీకరణ, క్లస్టర్ బేస్డ్ అభివృద్ధికి ప్రాధాన్యత
- పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చర్యలు
- సీఎసఆర్ తరహాలో పరిశోధనలకు కూడా పరిశ్రమలు నిధులివ్వాలి
- కాకినాడ జేఎన్టీయూలో హాలో లోకేష్ పేరిట విద్యార్థులతో యువనేత ముఖాముఖి
కాకినాడ (చైతన్యరథం): అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా నిలబెట్టాలన్నదే మా లక్ష్యం..అందులో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం..ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూలో శుక్రవారం హలో లోకేష్ పేరిట నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ,విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి జేఎన్టీయూ ఈసిఇ 3వ సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయన్నారు. పాదయాత్ర నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. రాష్ట్రంలో కోట్లాది ప్రజలు, యువత ఆశలు, ఆకాంక్షలు, సమస్యలను తెలుసుకునే అవకాశం లభించింది. పాదయాత్రలో ఎంతో నేర్చుకున్నా.
నాటి అనుభవాలనే ఇప్పుడు ప్రభుత్వంలో అమలు చేస్తున్నాం. ప్రభుత్వంలోకి రావడంతోనే మా పని పూర్తికాలేదు, అసలు పని ఇప్పుడే మొదలైంది. ఇకపై నెలకు ఒకసారి విద్యార్థులను కలవాలని భావిస్తున్నాను. దీనిద్వారా విద్యార్థుల ఆకాంక్షలు, మనోగతాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మీరు అద్భుతమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సమస్యలు చెప్పారు. మీ ఫీడ్ బ్యాక్ సీరియస్‌గా తీసుకుంటాం. మీ సలహాలు కరిక్యులమ్ ఇంప్రూవ్‌మెంట్‌కు దోహదపడతాయి. ఏ స్థాయిలో ఉన్నా మోరల్ వాల్యూస్ మరువద్దు. నైతికవిలువలు నేర్పించేందుకు చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించాం. ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు తీసుకోవడం లేదు. అమ్మకు చెప్పలేని పని మనం చెయ్యకూడదు అని గొప్పమాట చెప్పారు. అది సింపుల్, పవర్ పుల్ మాట అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
విద్యార్థుల ప్రశ్నలు — లోకేష్ సమాధానాలు
శ్రావ్య, సివిల్ ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థిని: మా గోదావరికి ప్రతీ సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం వరద సహాయ చర్యలు చేపడుతుంది. స్టూడెంట్స్‌గా మేము ఏమన్నా చేయగలమా? మా గోదావరిపై మీ ఆలోచనలు చెప్పండి?
నారా లోకేష్: దేశంలోనే ఉభయగోదావరి జిల్లాలు ధాన్యాగారంగా పేరొందాయి. ఆక్వాలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాయి. అయితే స్థిరమైన అభివృద్ధి సాధించడం అవసరం. గత 18నెలలుగా రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయి. ఆ వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. డిజైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ వంటివి ముఖ్యం. డిజిటల్ ట్విన్స్ ద్వారా వరదలను ముందుగా పసిగట్టే సాంకేతికతలపై దృష్టిసారించాలి. ఆక్వాలో ప్రపంచంలో నెం.1 స్థానంలో ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల కారణంగా కొత్త మార్కెట్లను వెతుకున్నాం. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు పరిష్కరించే దిశగా విద్యార్థులు పరిశోధనలపై దృష్టిపెట్టాలి.
యువరాజ్, బిటెక్, 2వ సంవత్సరం: సర్, మీరు ఇంజనీరింగ్‌లో రికార్డులు, అసైన్మెంట్‌లు మీరే రాసారా? ఎవరితో నైనా రాయించారా? మీ వైవా ఎలా జరిగింది?
నారా లోకేష్: నేను యుఎస్ కార్నెగీ మెల్లన్ కళాశాలలో ఇంజనీరింగ్ చేశా. అటెండెన్స్, హోం వర్క్, క్లాస్ పార్టిసిపేషన్ వంటి అంశాలకు విభాగాల వారీగా అక్కడ మార్కులు ఇస్తారు. మాకు వేరేవాళ్లతో రాయించే విధానం లేదు. ఎంత నేర్చుకున్నాననే విషయంపైనే నేను దృష్టిపెట్టాను. నేను బట్టీ పట్టే టైప్ స్టూడెంట్‌ను కాదు. క్రిటికల్ ఎనలిటికల్ థింకింగ్ పై దృష్టిపెట్టాను. విద్యామంత్రిగా కూడా అలాగే ఆలోచిస్తున్నా. వేరేవాళ్ల పేపర్ చూసి రాయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఏఐ మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ దానిపైనే పూర్తిగా ఆధారపడటం సబబుకాదు. మీ ఆలోచన శక్తిని, సృజనాత్మకతను వదులుకోవద్దు.
ఐశ్వర్య, 3వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్: యుపిలో కుంభమేళా ఘనంగా నిర్వహించారు. మీరు కూడా అక్కడకు వెళ్లారు. అక్కడ ఎలా నిర్వహించారు? రాబోయే గోదావరి పుష్కరాలు ఎలా చేయబోతున్నారు?
నారా లోకేష్: ఒక ధార్మిక కార్యక్రమానికి కోట్లాది మంది వచ్చినపుడు క్రౌడ్ మేనేజ్‌మెంట్, క్రౌడ్ మూమెంట్ పర్యవేక్షణ చాలా ముఖ్యం. కుంభమేళా సమయంలో అక్కడి ప్రభుత్వం అద్భుతంగా చేసింది. ఘాట్లన్నింటినీ డిజిటల్ ట్విన్‌తో అనుసంధానించారు. క్రౌండ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో అక్కడ చూశాం. గతంలో రాజమండ్రి పుష్కరాల సమయంలో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే సివిల్ వర్క్స్ స్టార్ట్ చేశాం. పుష్కర ఘాట్లలో క్రౌడ్ మేనేజ్‌మెంట్, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా జేఎన్టీయూ ద్వారా డిజిటల్ ట్విన్ ప్రాజెక్టును తయారు చేయాల్సిందిగా జేఎన్టీయూ మేనేజ్మెంట్‌కు విజ్ఞప్తిచేస్తున్నా.
సాయిప్రకాష్, బి.టెక్ 3వ సంవత్సరం: సార్ నేను పిఠాపురం పవన్ కళ్యాణ్ తాలూకా…మీరు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కలిసినా సొంత అన్నాదమ్ముల్లా కలిసిపోతారు.. మీరు మొదటి సారి ఎప్పుడు కలుసుకున్నారు… మీ ఇద్దరి మధ్యా ఎటువంటి బాండింగ్ ఉంది?
నారా లోకేష్: 2014 ఫలితాల తర్వాత తొలిసారి హైదరాబాద్‌లో ఫస్ట్ టైమ్ పవనన్నను కలిశా. జీవన ప్రయాణంలో ఎంతోమందిని కలుస్తుంటాం. కొందరి కలయిక ప్రత్యేకంగా నిలచిపోతుంది. చంద్రబాబును రిమాండ్‌లో పెట్టినపుడు పవనన్న వచ్చాడు. అక్కడ మాట్లాడుకున్నాం. తర్వాత థార్ వాహనంలో ఎక్కాం. ముందు పవనన్న, నా పక్కన బాలయ్యబాబు కూర్చున్నారు. నేను చాలా టెన్షన్‌గా ఫీలయ్యాను. ఆ రోజు పవనన్న మమ్మల్ని పలకరించి, కుటుంబానికి అండగా నిలబడిన విధానం జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. మంచిగా ఉన్నపుడు అంతా మనవద్దకు వస్తారు. కష్టకాలంలో తక్కువమంది మాత్రమే అండగా ఉంటారు. ఎవరైతే కష్టకాలంలో మన వెంట నిలబడతారో… అటువంటి వారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత యువతపై ఉంది.
చాందిని, బిటెక్ విద్యార్థిని: సర్, ఎప్పటి నుండో నాకు ఒక ప్రశ్నఉంది.. మనం ఎంత ఎదిగినా కులం, మతం, ప్రాంతం అనే చట్రాల్లో ఇరుక్కొని పోతున్నాము.. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?
నారా లోకేష్: కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం మనమధ్య డివిజన్ తెస్తున్నారు. ఏ కుటుంబంలో పుట్టడం అన్నది దేవుడు నిర్ణయిస్తారు. మనందరిపైన పవిత్ర బాధ్యత ఉంది. మనుషులుగా మనపై కొంత సామాజిక బాధ్యత ఉంది. భారత ప్రజాస్వామ్యం ఇతర దేశాలకంటే చాలా గొప్పది. దేశానికి మనవంతు సేవలందించాలి. మాది చిన్న కుటుంబం. మా ఇంట్లో మేమంతా కలిసే ఉంటాం. మేం అయిదుగురు కుటుంబ సభ్యులం. మాకు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు లేవు. మావి అన్నీ ఉమ్మడి ఆస్తులే. మేమంతా ఒక్కటిగానే ముందుకు సాగుతాం. అదే భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ గొప్పదనం. ఏఐ, యూ ట్యూబ్, టిక్‌టాక్ లాంటి సాంకేతికతలు మన సంస్కృతి, సాంప్రదాయాలను భర్తీచేయలేవు. ఇతరుల నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం.
దిలీప్ కుమార్, పెట్రోలియం ఇంజనీరింగ్, 3వ సంవత్సరం: లెర్నింగ్ ఎక్సలెన్స్ అవుట్‌కమ్స్ కోసం ప్రాథమికస్థాయిలో మీరు లీప్ ప్రోగ్రామ్ ను అమలుచేస్తున్నారు. సింపుల్ లోకాస్ట్ మోడల్‌లో ఇంజనీరింగ్ కాలేజిల్లో లీప్ నమూనాలోనే డిజైనింగ్, టెస్టింగ్, ఇనిస్టిట్యూషనలైజ్ మోడల్ అమలు చేయగలరా?
నారా లోకేష్: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఇండస్ట్రీ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరిక్యులమ్ రూపొందించి స్కిల్ గ్యాప్‌ను భర్తీచేస్తున్నాం. స్కిల్ గ్యాప్ ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లో ఉంది. దీనిని భర్తీ చేయడంలో ఇండస్ట్రీది కూడా ముఖ్యమైన పాత్ర. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు ఏం అవసరమో ఇప్పటినుంచే చెబితే అందుకు తగ్గట్టుగా కరిక్యులమ్ రూపొందిస్తాం. బ్లూ కాలర్ వర్కర్లకు కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తాం. ల్యాబ్ లు కూడా చాలా ముఖ్యం. అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల వంటివి ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటివి అన్ని యూనివర్సిటీల్లో ఏర్పాటుచేస్తాం. పెట్రోలియం, ఆక్వా, గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్‌గా ఇక్కడ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రతి వర్సిటీలో అక్కడ వచ్చే పరిశ్రమలకు అనుగుణంగా అవసరమైన ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధనలు చాలా అవసరం. భారతదేశ వ్యాప్తంగా రిసెర్చి కొరతగా ఉంది. కేంద్రమంత్రి అశ్వనీ వైష్టవ్‌ను దావోస్‌లో కలిసినపుడు సిఎసఆర్ ఫండ్స్ తరహాలో ఆర్ అండ్ డి పై కొంత పర్సంటేజిని పరిశ్రమలు యూనివర్సిటీలకు కేటాయించాలని కోరాను. నాలుగు నెలల క్రితం ఆస్ట్రేలియా పర్యటన చేశాను. అక్కడ గ్రిఫిత్ వర్సిటీ స్పోర్ట్స్ పైన, జేమ్స్ కుక్ ఆక్వా రంగంలో ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నాయి. సోలార్ సెల్ టెక్నాలజీ 90శాతం నార్త్ సౌత్ వేల్స్ వర్సిటీలో అభివృద్ధి చేస్తున్నారు. మనరాష్ట్రంలో క్లస్టర్డ్ బేస్డ్ రిసెర్చి అవసరం. ఇందుకు అవసరమైన ప్రత్యేక ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నాం.
కౌశిక్, బిటెక్ 3వ సంవత్సరం: కాలేజీ బంక్ ఎప్పుడన్నా కొట్టారా? కొడితే ఎక్కడకి వెళ్లేవారన్నా?
నారా లోకేష్: నేను చదువుకున్న అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విభిన్నమైంది. అక్కడ అటెండెన్స్‌కు 5శాతం మార్కులు ఉంటాయి. కాలేజి అయ్యాక క్యాంటీన్ లో జీవిత అనుభవాలను కెఫెటేరియాలో మాట్లాడుకుని పంచుకునేవాళ్లం. నేను పెద్దగా క్లాసులకు బంక్ కొట్టలేదు. నాకు 90శాతం అటెండెన్స్ ఉండేది. బ్రాహ్మణి మాత్రం 100 శాతం అటెండెన్స్. క్లాసు అయిన తర్వాత మిత్రులతో సుహృద్భావమైన చర్చలు జరిగితే భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.
కీర్తి, కెమికల్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం: ఏపీ¾ అభృవృద్ధిలో కెమికల్ ఇంజనీరింగ్ ను ఎలా ఉపయోగించుకుంటారు?
నారా లోకేష్: క్లస్టరైజేషన్ విధానం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడ వాతావరణానికి అనుకూలమైన పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన ఎకోసిస్టమ్ కల్పిస్తాం. తాజాగా అనకాపల్లిలో ప్రత్యేకమైన క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నాం. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాను. నాకు కెమికల్ ఇంజనీరింగ్ పై పెద్ద అవగాహన లేదు. అయితే క్లస్టర్ బేస్డ్ కెమికల్ ఫార్మా సంస్థను ఏపీలో ఏర్పాటు చేస్తాం.
అడ్డూరి ఆలయశ్రీ, బి.టెక్ విద్యార్థిని: నేను ఈ ఏడాది ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్నాను. ఎలా జాబ్ సంపాదించాలి. కౌశలం వంటి ప్రోగ్రామ్ మాకు ఎలా ఉపయోగపడుతుంది?
నారా లోకేష్: ఏపీలో నైపుణ్యం పోర్టల్ ద్వారా సప్లయ్ – డిమాండ్ ఆగ్రిగేషన్ చేస్తూ స్కిల్ ఎసెస్‌మెంట్ చేసేలా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టాం. కాన్వర్సేషనల్ ఏఐ ద్వారా స్కిల్ ఎసెస్‌మెంట్ చేస్తున్నాం. దీనిద్వారా ఇప్పటికే 75 వేలమందిని స్క్రీనింగ్ చేశాం. ఆంధ్రప్రదేశ్‌కు 3 జిపియులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు, త్వరలో అవి రాష్ట్రానికి వస్తాయి. వీటి ద్వారా స్కిల్స్ పొందిన విద్యార్థులు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. స్కిల్ ఎసెస్‌మెంట్ యాక్సెస్ ఉంటుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 755 కంపెనీలు ఏపీకి వచ్చాయి. ప్రస్తుతం అవన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయి. ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, రిలయన్స్, ఫార్మా, ఆటోమేటివ్, రెన్యువబుల్, తదితర 22 సెక్టార్లలో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయి. అయితే ఇది ప్రారంభం మాత్రమే. వ్యవసాయంలో దక్షిణభారతంలో నెం.1 గా ఉన్నాం. వ్యవసాయరంగంలో ఫుడ్ ఫ్రాసెసింగ్, ఎంఎసఎంఇ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించమని ఈ రోజు కూడా ఒక తల్లి అడిగింది. సంక్షేమంతోపాటు ఉద్యోగాల కల్పనకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
శ్రావ్య, బిటెక్ 3వ సంవత్సరం: సర్.. మీరు, సీఎం దావోస్ వెళ్లారు కదా.. అసలు అక్కడ కేవలం చర్చలేనా? పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనకు ఎన్ని హామీలు వచ్చాయి, ఎన్ని లోకల్ వాళ్లకు అవకాశం ఇస్తాయి?
నారా లోకేష్: మన ప్రత్యేకతలు, అనుకూలతలను చెప్పుకోవడానికి దావోస్ ఒక అద్భుతమైన చర్చావేదిక. రాష్ట్రంలో కొత్తగా క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రవేశపెడుతున్నాం. ఎకో సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలనే విషయమై 20మంది అంతర్జాతీయ నిపుణులతో చర్చించాం. దావోస్ లో నేను 20 సెషన్స్ కు హాజరయ్యా. పాలసీ మేకర్లు లెర్నర్లుగా ఉండాలి. దావోస్ వివిధ రంగాల నిపుణులను కలవడానికి ఉద్దేశించింది. గత ఏడాది కాగ్నిజెంట్ సిఇఓ రవిని కలిసి ఏపీకి రావాలని కోరాను. 11 నెలల 15రోజుల తర్వాత విశాఖలో ఆ సంస్థ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేశాం. వచ్చే ఏడాదికి కొన్ని ప్రధాన భవనాలు సిద్ధం అవుతాయి. దావోస్ సదస్సు ఎంఓయులు చేసుకోవడానికి కాదు. 1995 నుంచి రాష్ట్రం తరపున అటెండ్ అవుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ పరిశ్రమల ద్వారా ఇప్పటివరకు 4లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో 80 శాతం స్థానికులకు వచ్చాయి. మా ఎజెండా 20లక్షల ఉద్యోగాలు… పెట్టుబడుల ఆకర్షణ ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాం.
అహల్య, బి.టెక్ విద్యార్థిని: మీరు ఎప్పుడైనా ఇంటర్న్ షిప్, ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా? మీరు ఎదుర్కొన్న క్లిష్టమైన ఇంటర్వ్యూ ఏంటి? విభిన్న టెక్నాలజీలను మన వర్సిటీల్లో ఏవిధంగా ప్రవేశపెడతారు?
నారా లోకేష్: మనవద్ద ఉన్న వర్సిటీల్లో కూడా డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో యువత కోసం వర్టికల్ అండ్ హారిజంటల్ ఇంటిగ్రేషన్‌పై దృష్టిపెట్టాం. మొదటిది వర్టికల్.. పరిశ్రమకు అవసరమైన అనుబంధ పరికరాలు తయారుచేసే యూనిట్లన్నీ ఒకచోట ఉండేలా చర్యలు చేపడుతున్నాం. రెండోది హారిజంటల్.. టెస్టింగ్, పరిశోధన వంటి అంశాలపై దృష్టిపెడుతున్నాం. అయితే ఓవర్ నైట్ ఇవన్నీ చేయలేం. నేను కార్నెగి మెల్లన్‌లో చదివి, వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగం చేశా. అక్కడ హానర్ కోడ్ అమలుచేస్తారు. చిత్రంగా ఫైనల్ ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ ఉండరు. ఆ క్రమశిక్షణ స్టాన్‌ఫోర్డ్ లో కూడా ఉంది. అటువంటివి మనం నేర్చుకోవాలి. రెండవది గ్లోబల్ ఎక్స్‌పోజర్. విదేశీ యూనివర్సిటీల నుంచి కల్చరల్ కాంటెస్ట్, ఐడియా ఎక్స్చేంజి వంటివి మనం తెలుసుకోవాలి. గ్లోబల్ టాలెంట్ మన రాష్ట్రంలో తయారు చేయాలన్నదే నా ధ్యేయం. నేను 3 ఇంటర్న్ షిప్‌లు చేశా. 2002-03లో జర్మనీ లో పనిచేసినప్పుడు లాంగ్వేజ్ సమస్య ఉంది. అక్కడ సంస్కృతులను ఆర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది.
అవినాష్, పెట్రోలియం ఇంజనీరింగ్: విద్యార్థులకు ట్రాన్స్‌పోర్టేషన్ ఇబ్బందిగా ఉంది. రద్దీవల్ల కాలేజి, స్కూలు పిల్లలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలి. కాకినాడలో ఒక్కొక బెడ్ పై ఇద్దరు ఉంటున్నారు. ప్రైవేటు స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇంకా వెనుకబడి ఉంటున్నారు?
నారా లోకేష్: ఉచిత బస్సు పథకం ద్వారా పెరిగిన రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి. ఇన్ ఫ్రా ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. కానీ నిర్వహణ ఇబ్బందిగా ఉంటుంది. స్ట్రిక్ట్ గైడ్ లైన్స్‌తో స్టాండర్డ్స్ మెయింటెన్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. గతంలో మందుల షార్టేజి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 3శాతం మాత్రమే ఒన్ క్లాస్ వన్ టీచర్ విధానం ఉండేది. 97శాతం పాఠశాలల్లో ఒకే టీచర్ ఉండేవారు. నేను బాధ్యతలు చేపట్టాక వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ తేవాలని నిర్ణయించాం. 30శాతం పాఠశాలల్లో ఇప్పటికే అమలు చేశాం. 16వేల మందిని రిక్రూట్‌మెంట్ చేసి ఇందుకోసం ఏర్పాటు చేసాం. పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటున్నారో తెలుసుకునేందుకు ఏఐ టూల్ వాడుతున్నాం. 13లక్షల మంది పిల్లలను ఎఫఎలఎన్ విధానంలో పరీక్షించాం. స్థిరమైన పాలసీ, కొనసాగింపు ముఖ్యం. ఇదే విధానాన్ని కొనసాగించి రాబోయే రోజుల్లో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారుచేస్తాం.
విశాల్, కెమికల్ ఇంజనీరింగ్: ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు.. గ్రీన్/ రెన్యువబుల్ ఎనర్జీపై మీ పాలసీ ఏంటి?
నారా లోకేష్: రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ దే భవిష్యత్. త్వరలో ఇతర దేశాలకు భారత్ గ్రీన్ అమ్మోనియా సరఫరా చేయబోతోంది. గ్రీన్ పవర్, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులపై మేం దృషిపెట్టాం. ఏపీలో ఎనర్జీ సబ్‌స్టిట్యూట్ తయారు చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీలో భారత్ లీడర్‌గా ఉండబోతుంది. ఎనర్జీ మాలిక్యూల్స్ ఎక్స్‌పోర్టర్ గా ఆవిర్భవించబోతున్నాం. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్టు ప్రాజెక్టును ఇటీవల కాకినాడలో ప్రారంభించాం.
ప్రసన్న: రాష్ట్రంలో ఫార్మసీ అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?
నారా లోకేష్: ఫార్మా సంబంధిత కంపెనీలను రాష్ట్రానికి రప్పించే ఎకో సిస్టమ్ తేవాలి. మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ విశాఖలో చేస్తున్నాం. ఎఎంటిజడ్ అలాంటిదే. గతంలో చంద్రబాబు హైదరాబాద్ కు జీనోమ్ వ్యాలీ తెచ్చారు. అక్కడ పురుడుపోసుకున్న భారత్ బయోటెక్ ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అదే ఎకో సిస్టమ్ పవర్. అటువంటి ఎకోసిస్టమ్ రాష్ట్రంలో కల్పిస్తాం.
వాసుదేవ్, బిటెక్ ఫైనలియర్, పెట్రోలియం ఇంజనీరింగ్: మేం కొన్ని సమస్యలతో సతమతమవుతున్నాం. ఆయిల్ అండ్ గ్యాస్‌కు సంబంధించి ప్లేస్‌మెంట్స్ రావడం లేదు. ఒఎన్‌జిసి లాంటి కంపెనీలు మమ్మల్ని రిక్రూట్ చేయడం లేదు. ప్రైవేట్ కాలేజ్ వారిని రిక్రూట్ చేస్తున్నారు. మెకానికల్ చదివే వారికి కూడా కోర్ సైడ్ జాబ్స్ రావడం లేదు. పెద్ద కంపెనీలు యూనివర్సిటీ వైపు రావడం లేదు. ప్రైవేటు కాలేజి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వండి. ప్రొఫెసర్ పోస్టులు భర్తీచేయండి.
నారా లోకేష్: కెరీర్ గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ బాధ్యత వీసీలకు అప్పగించాం. ప్లేస్‌మెంట్స్ బాధ్యత కూడా వారిదే. రాజకీయ ప్రమేయం లేకుండా వీసీలను నియమించాం. రీయింబర్స్‌మెంట్ కాలేజి ఎకౌంట్‌లకే నేరుగా జమచేస్తాం. 2019కి ముందు వ్యవస్థ అమలు చేస్తాం. ఎవరూ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మేం చెల్లిస్తాం. గత ప్రభుత్వం పెట్టి పోయిన బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం క్రమపద్ధతిలో చెల్లిస్తుంది. అది మా బాధ్యత. 4వేల ప్రొఫెసర్ పోస్టులు భర్తీచేయాల్సి ఉంది. న్యాయ చిక్కులను తొలగించి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తాం.
తులసి బి.టెక్ 2వసంవత్సరం: 7వతరగతి నుంచి ఒక డౌట్ ఉంది. ఇంగ్లీషు, తెలుగు మాదిరిగా వ్యవసాయం ఒక సబ్జెక్టు ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ కళాశాలల్లో. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఫీల్డ్ ట్రిప్స్ ఏర్పాటుచేయాలి. ఇన్సూరెన్స్ లపై కూడా రైతులకు అవగాహన కల్పించండి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఐడియాల కోసం హ్యాకథాన్ నిర్వహించాలి.
నారా లోకేష్: రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ఆ పనిలో ఉంది. ఇందులో ఇన్వెస్టర్లు పాలు పంచుకుంటున్నాం. గ్రీన్ మాలిక్యూల్స్ తయారీ వంటి స్టార్టప్స్ ను ప్రోత్సహిస్తున్నాం. చిన్నవయసులో వ్యవసాయం, ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ పై అవగాహన అవసరం. అందుకే శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించాం. వ్యవసాయం లాభసాటిగా చేయడంపై దృష్టి సారిస్తున్నాం. మిర్చికి గత ఏడాది ధరలు పడిపోయాయి. సప్లయ్ , డిమాండ్ మ్యాచ్ చేయడంపై దృష్టి పెట్టాం. ప్రజావేదికలో ఏం పంటలు వేయాలనే విషయమై చర్చిస్తున్నాం. 2006లో కుప్పంలో ఒక రైతును కలిశాను. ఆయన 25ఎకరాల్లో లాభసాటిగా వ్యవసాయం చేస్తున్నారు. అందరూ వేసే పంటలు వేయకపోవడమే ఆయన విజయ రహస్యం. లైఫ్ స్కిల్స్, ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ పై కూడా అవగాహన కల్పిస్తాం. గిట్టుబాటు ధర, ఇన్సూరెన్స్ ఒక భాగం. వాల్యు చైన్, సప్లయ్ డిమాండ్‌ను అనుసంధానించాలి. ప్రపంచానికి కావాల్సిన మామిడి పండించాలి. జపాన్‌లో పండించే ఒకరకం మామిడికి డిమాండ్ ఉంది. ఆక్వాలో ఇప్పటివరకు యుఎస్‌కు అనుగుణంగా ఉత్పత్తులు చేస్తున్నారు. ఇప్పుడు యూరప్ మార్కెట్‌కు అనుగుణంగా ప్రమాణాలు పాటించాలి. క్రాప్ డైవర్సిఫికేషన్ మంచి పరిష్కారం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారుచేయడం ముఖ్యమంత్రి లక్ష్యం.
కోమలి స్వాతి, 3వసంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్: సర్, భారత దేశం డెవలప్ అవుతూనే ఉంది.. కానీ పేదరికం తగ్గటం లేదు కాదా.. ఆదాయ అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి.. భూముల విలువ పెరగటమే అభివృద్ధి అనే ఆలోచనలు ఎంత వరకు కరెక్ట్? మీ దృష్టిలో డెవలప్‌మెంట్ అంటే ఏంటి?
నారా లోకేష్: నైతిక విలువలు, ఎథికల్ ఫ్రేమ్ వర్క్ లేకుండా అభివృద్ధికి అర్థం లేదు. ధనవంతులు మరింత ధనవంతులు, పేదలు మరింత పేదలుగా మారడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ అంతరాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి పీ 4 విధానాన్ని తెచ్చారు. గతంలో ఐటి విప్లవంతో ఫార్చూన్ 500 కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొత్త సాంకేతికలపై దృష్టిపెట్టాం. మా కృషితో రాష్ట్రానికి డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఏఐ, క్వాంటమ్ వంటి సాంకేతికలకు భారత్ కు మంచి అవకాశం.
ప్రెస్కిల్లా, బి.టెక్ విద్యార్థిని: సర్, మీరు పిల్లలకు సోషల్ మీడియా బాన్ చెయ్యాలి అంటున్నారు కదా.. పిల్లలకు ఆటలు, పాటలు వంటి ఇతర సరదాలు లేకుండా అది నిజంగా సాధ్యమేనా? అసలు మనకు గ్రౌండ్స్, లైబ్రరీస్ లేవు కదా? ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏం చేస్తారు.
నారా లోకేష్: వయసు ఆధారిత కంటెంట్ యాక్సెస్ ఉండాలన్నది మా ఉద్దేశం. మెటా, గూగుల్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను పిల్లలు ఉపయోగించకుండా చేయడం మా ఆలోచన. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు లైబ్రరీలను కూడా ప్రక్షాళన చేస్తున్నాం. జిల్లాకు, జోన్‌కు మెగా లైబ్రరీ, అమరావతిలో ప్రతిష్టాత్మక లైబ్రరీ నిర్మిస్తున్నాం. లైబ్రరీలను బలోపేతం చేస్తాం. స్టోర్ట్స్ స్టేడియంలు అభివృద్ధి చేస్తున్నాం. సైబర్ బుల్లింగ్ ప్రమాదకర పరిణామం. 13-16 సంవత్సరాల మధ్యే ఇది జరుగుతోంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశంలో పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే విషయమై చర్చించాం. వచ్చే సమావేశాలకు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ప్రతినిధులను రావాలని కోరాం. ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియాలోని గోవాలో ఇప్పటికే నిషేధం ఉంది.
నాగేశ్వరి, తాడేపల్లిగూడెం, ఈసిఇ బిటెక్ ఫైనలియర్: చాలా పరిశ్రమలు తెచ్చారు. గోదావరి జిల్లాలకు ఏం చేస్తారు. ఇటీవల మన రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్లో మా గోదావరి జిల్లాలకు చాలా తక్కువగా వస్తున్నాయి. మాకు రాబోయే పరిశ్రమలు ఏమున్నాయి.. మేము ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి?
నారా లోకేష్: అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. అన్నిప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. క్లస్టర్డ్ బేస్డ్ అభివృద్ధిలో భాగంగా ఉభయగోదావరిలో గ్రీన్ మాలిక్యూల్స్‌లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆక్వా రీసెర్చిని ప్రోత్సహిస్తున్నాం. పామాయిల్, కోకోకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎకో సిస్టమ్ కు అనుగుణంగా పరిశ్రమలు తెస్తాం.
కీర్తి, ఎంఎ సెకండియర్, మార్కెటింగ్: మేం ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తారు?
నారా లోకేష్: ఇందుకోసం వైబ్రంట్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆర్‌టిఐహెచ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం. యువత జాబ్ సీకర్‌గా కాకుండా జాబ్ క్రియేటర్ గా తయారు కావాలన్నది మా లక్ష్యం. ఏదైనా ప్రయత్నంలో కిందపడటం సహజం. మళ్లీ లేచి పరుగెట్టడం కూడా అంతే ముఖ్యం. నేను 2019లో మంగళగిరిలో 5300 ఓట్లతో ఓడిపోయా. ఆ తర్వాత అయిదేళ్లు కష్టపడ్డా. 3వ అతిపెద్ద మెజారిటీతో 2024లో గెలుపొందాను. చంద్రబాబు ఒక సీరియస్ ఎంటర్‌ప్రెన్యూర్. 4పరిశ్రమలు ప్రారంభించి మూడింటిలో ఆయన ఫెయిలయ్యారు. 4వది హెరిటేజ్‌లో సక్సెస్ అయ్యారు. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు, కాకినాడ), పంతం నానాజీ (కాకినాడ రూరల్), ఆదిరెడ్డి శ్రీనివాస్ (రాజమండ్రి), యనమల దివ్య (తుని), ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ జెఎన్ టియు వైస్ చాన్స్‌లర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్, ఇన్‌చార్జి ఆర్. శ్రీనివాసరావు, రెక్టార్ పి.సుబ్బారావు, ప్రిన్సిపాల్ ఎన్. మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
















