- తప్పులు చేసే వారికి శిక్షలు తప్పవు
- రైతు ఆవేదనకు స్పందించిన చంద్రబాబు
- బుగ్గన భూకబ్జాపై విచారణకు ఆర్డీవోకు ఆదేశాలు
- ప్రజల మధ్యనే ఇకపై సమస్యల పరిష్కారమని స్పష్టం
నంద్యాల(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలిం చారు. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబుకు ప్యాపిలీ మండలానికి చెందిన రైతు పొలెం రామచంద్ర ఫిర్యాదు చేశారు. 110 ఏళ్ల నుంచి తమ ఆధీనంలో ఉన్న భూమిని బుగ్గన తన అనుచరులకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ సహా చాలా మందికి ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వివరించారు. ఇందుకు స్పందించిన సీఎం చంద్రబాబు ఆర్డీవోను పిలిపించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కరించకుండా… బాధితుడికి న్యాయం చేయకుండా ఎందుకు తిప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. బుగ్గన బాధితుడైన రామచంద్ర ఫిర్యాదును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి… న్యాయం చేయాలని ఆదేశించారు. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే ఆక్రమణ దారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఓ రైతు భూమిని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన అనుచరుల పేరుతో మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద లక్షల ఎకరాల భూములను అధికారుల ప్రమేయం లేకుండానే ఇష్టారాజ్యంగా తారుమారు చేశారన్నారు. ఎన్నికల ముందు పాన్యంలో పాస్ బుక్‌ను చించేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేస్తానని తాను హామీ ఇచ్చానని గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశానని తెలిపారు. కాగా రామచంద్ర చేసిన ఫిర్యాదును అన్ని కోణాల్లో పరిశీలిస్తానని… ఏమైనా తేడా చేసినట్టు తేలితే ప్రమాదంలో పడతారంటూ ఆర్డీవోను హెచ్చరించారు. ఈ ఫిర్యాదును స్టడీ చేసి వెంటనే మంత్రికి నివేదిక ఇవ్వాలని వేదిక మీద నుంచే ఆదేశించా రు. రైతుల భూములను వేరే వాళ్లు ఆక్రమిస్తే చాలా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఆగడాలు అరికట్టాలనే ప్రత్యేక చట్టం తెచ్చామని.. పీడీ యాక్ట్ పెట్టి శాశ్వతంగా జైలులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ అధికారి తప్పు చేసినా గ్రామ పంచాయతీల్లోనే వారి గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. ప్రజల మధ్యనే ఇకపై సమస్యల పరిష్కరించే విధానాన్ని అవలంభిస్తామని స్పష్టం చేశారు. ఎంత పెద్ద వాళ్లయినా తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెడతానని హెచ్చరించారు.















