- శ్రమశక్తిలో మహిళల ఇతోధిక భాగస్వామ్యంతో సాధికారత
- సామాజిక, ఆర్థిక సమానత్వంతో జనాభా స్థిరీకరణలో మహిళలకు పెద్దపీట
- వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): పలు సామాజిక, ఆర్థిక పరిమితులతో వివక్షకు గురవుతున్న మహిళలకు సాధికారిత (ఎంపవర్మెంట్) ద్వారా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కల్పించడానికి ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళిక రూపొందించింది. సుదీర్ఘ కాలంపాటు రాష్ట్ర సమగ్ర ప్రగతికి బాటలవేసే దిశగా ప్రభుత్వం రూపొందించిన నూతన ‘జనాభా స్థీరికరణ’ విధానంలో భాగంగా మహిళా సాధికారత కోసం 10 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించినట్టు వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “రాష్ట్ర ప్రగతికి కీలకమైన నూతన జనాభా నిర్వహణలో మహిళల కీలక పాత్రను గుర్తించిన కూటమి ప్రభుత్వం పక్కా విధానాన్ని రూపొందించింది. గర్భధారణ మరియు శిశు సంరక్షలను మహిళా హక్కుగా గుర్తించిన ప్రభుత్వం అన్ని దశల్లోనూ అండగా ఉండి, అనుకూల వాతావారణాన్ని కల్పించి, లింగ వివక్షకు తెరిదించింది. సమాజా వికాసంలో మహిళా శక్తికి తమ పాత్రను పూర్తిస్థాయిలో నిర్వహించేలా చూసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది” అని మంత్రి పేర్కొన్నారు.
స్త్రీశక్తి ఆవిష్కరణకు పది సూత్రాలు
మహిళల జీవనంలోని అన్ని దశల్లోనూ నాణ్యమైన సేవల్ని అందుబాటులో ఉంచి వారికి సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడం, సంతాన ప్రాప్తి హక్కును సరైన విధానంలో సాకారం చేయడం, ఆర్థిక స్వావలంబనకు వారికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించడం, శిశు సంరక్షణలో పురుషుల్ని భాగస్వాములు చేయడం ఈ పది సూత్రాల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని మంత్రి సత్యకుమార్ వివరించారు.
స్త్రీ అనుకూల పనివాతావరణ కల్పన
పురుషులతో పాటు సమానంగా మహిళలు ఆర్థిక ఉత్పాదక శక్తిగా ఆవిర్భవించేందకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా…ఆరేళ్ల వయసు వరకు శిశువుల సంరక్షణ కోసం 50 మందికి పైగా ఉద్యోగులుండే ప్రతి చోటా శిశు పాలనా కేంద్రాల్ని (క్రెష్‌లు) ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా చర్యల్ని ప్రతిపాదించిందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాటితో పాటు…ప్రతి లక్ష జనాభాకు ఒకటి చొప్పున ‘వర్కింగ్ ఉమెన్స్ హాస్టల’ ను పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోబడతాయి.
ప్రస్తుతం…శిశు పాలనా కేంద్రాల బాధ్యత ప్రధానంగా మహిళలపైనే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రస్తుత సామాజిక విలువల్లో తగు చైతన్య కార్యక్రమాల ద్వారా మార్పు తెచ్చి ‘శిశు పాలనలో సమాజ బాధ్యత’ అన్న నినాదం ద్వారా పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ మార్పు తేవాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ఈ దిశగా ప్రస్తుతం అమలులో ఉన్న 180 రోజుల ప్రసూతి సెలవులను (మెటర్నటీ లీవ్) 12 నెలల పేరెంట్ హుడ్ లీవ్‌గా తల్లిదండ్రులిద్దరూ సమానంగా వాడుకునే వీలు కల్పిస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
సంతాన ప్రాప్తి హక్కు గుర్తింపు
సంతాన ప్రాప్తి హక్కు ప్రతి జంట ఆకాంక్ష. హక్కు అని, అయితే రాష్ట్రంలో దాదాపు 12 లక్షల కుటుంబాలు సంతాన వైఫల్యంతో పలు సమస్యలకు గురవుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారంగా అట్టి కుటుంబాలకు సంతానోత్పత్తి సేవల్ని ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. సాలీనా 50,000 కుటుంబాలకు ఈ సేవల్ని ఉచితంగా అందజేసే విధంగా ప్రభుత్వం తగు చర్యల్ని తసుకుంటుందని ఆయన అన్నారు. దేశంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ సేవలకు శ్రీకారం చుడతామని మంత్రి తెలిపారు. ఇందు నిమిత్తం దేశంలో తొలిసారిగా
‘మాతృత్వ’ పధకం కింద ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రిప్రొడిక్టివ్ హెల్త్ ‘ ను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పాటు ఈ సేవలకు సంబంధించి 6 నెలల డిప్లొమా కోర్సు, సంవత్సరం పాటు సాగే అడ్వాన్స్‌డ్ కోర్సులను ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సాలీనా దాదాపు నాలుగు వేల మంది ప్రసూతి వైద్యులు పట్టాలు పుచ్చుకుంటున్నారని, వారికి సంతానోత్పత్తి సేవలందించడంలో నైపుణ్యాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు
మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ
పిన్న వయసులో గర్భధారణ, పౌస్టికాహార లోపం, అధిక సంఖ్యలో సిజేరియన్ జననాలు, భారీ స్థాయిలో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, తరచుగా ప్రసవాల కారణంగా మాతృమూర్తులు అనారోగ్యానికి గురవడాన్ని గుర్తించిన ప్రభుత్వం పరిష్కార లక్ష్యాలను నిర్దేశించినట్లు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా… గర్భధారణకు ముందు, అనంతర చర్యల పట్ల మహిళలకు తగు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం మహిళలకు 70 శాతం వరకు జరుగుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఐదేళ్లలో 50 శాతానికి తగ్గించాలన్నారు. మహిళల జననాంగాల్లో వాడే గర్భ నిరోధక పరికరాలు, ఇంజెక్షన్ల ద్వారా గర్భ నిరోధక మందులు, మాత్రల వినియోగాన్ని పెంచడం, సరైన అవగాహనతో శిశు జననాల మధ్య తగు వ్యవధి ఉండేలా చూడడంపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో 68 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నాయని, తగు చర్యల ద్వారా వీటిని ఐదేళ్లలో 40 శాతానికి తగ్గించాల్సిన అవసరముందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నొక్కి వక్కాణించారు. రాష్ట్రంలో పిన్న వయసులో గర్భ ధారణ దాదాపు 9 శాతంగా నమోదవుతోందని, దీన్ని 3 శాతానికి తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.
కేర్ ఎకానమీ వర్క్ ఫోర్స్
కుటుంబ నియంత్రణ ఆధారిత సాంప్రదాయ జనాభా నియంత్రణకు భిన్నంగా జానాభా స్థిరీకరణకు అవలంబించాల్సిన ప్రభుత్వ ప్రతిపాదిత నూతన విధానంలో ‘జనాభా భద్రత’ (పాపులేషన్ కేర్) ప్రధానమన్న మంత్రి, ఈ దిశగా ‘కేర్ సర్వీసెస’ అందించే సహాయకులను భారీస్థాయిలో అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ దిశగా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్వయం సహాయక బృందాలను సామాజిక, ఆర్థిక మార్పు సాధకాలుగా రూపొందించవచ్చన్నారు. శిశు సేవలు, వృద్ధాప్య సేవలందించే వారికి మంచి డిమాండ్ ఉంటుందన్న మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, సాలీనా 5,000 చొప్పున శిశు సహాయక సేవలు , వృధ్యాప్య సేవలందించేవారిని తయారు చేస్తామన్నారు. ఇందుకోసం తగు సర్టిఫికేషన్ కొరకు కోర్సులు ప్రారంభించి, సర్టిఫికెట్ పొందిన వారిని ప్రభుత్వ కేర్ సంస్థలు, ఇతర అవసరాలున్న చోట నియమిస్తామన్నారు.
శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెంపు
ఆర్థిక ఉత్పాదకతకు సహకరించే శ్రామిక శక్తి (వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్)కు సంబంధించి మహిళల్లో భాగస్వామ్యం కేవలం 31శాతం మాత్రమే ఉండడంపై మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా మహిళల్లో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటును 61 శాతానికి పెంచాల్సి ఉందని, దీనివలన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 15 శాతం పెరుగుతుందని ఆయన అన్నారు. దీనికోసం ప్రవేశ ఆటంకాలు, ప్రతికూల పని పరిస్థితులు , లింగ వివక్షకు దారితీసే సామాజిక విలువలు, శిశువుల పెంపకానికి పురుషులు దూరంగా ఉండడానికి గల కారణాలను సత్వరమే నిర్మూలించాలని, అందుకు తగిన విస్తృత చర్యలను ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ప్రస్తుత నిర్దిష్ట పనివేళలు మహిళలకు అనుకూలంగా లేవని క్రమేణా…మహిళలకు అనుకూలంగా సడలింపులతో కూడిన పని వేళలు, ఇంటి నుండి పనిచేసే విధంగా చర్యల్ని చేపడతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా గర్భధారణ, ప్రసవానికి ముందు, అనంతర, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశల్లో మహిళలకు పూర్తి ఆరోగ్య రక్షణ మరియు శ్రమ శక్తిలో తగు భాగస్వామ్యంతో మహిళల పూర్తి సాధికారతతో జనాభా స్థిరీకరణ కోసం మహిళల ఐచ్ఛిక నిర్ణయాలతో సత్ఫలితాలను సాధించవచ్చని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
















