ఉండవల్లి (చైతన్య రథం): మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతి పురస్కరించుకుని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, నేతలు కంచర్ల శ్రీకాంత్, ఉండవల్లి శ్రీదేవి, పిల్లిమాణిక్యాలరావు, బాలకోటయ్య తదితరులు జగ్గజీవన్ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. “దేశంలో వ్యవసాయాన్ని ఆధునీకరించటంతోపాటు ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించిన మహానుభావుడు. పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్‌లాంటి ఎన్నో సంస్కరణలు అమలు చేసిన మహనీయుడు.
బాబూ జగజ్జీవన్ రామ్ స్పూర్తితోనే ప్రభుత్వం నడుస్తోంది. ఎస్సీల్లోని అన్ని కులాలకూ సమాన అవకాశాలు దక్కాలనే వర్గీకరణ చేపట్టాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దళిత వర్గాలకు న్యాయం జరగాలన్నదే టీడీపీ విధానమని, ఎస్సీల అభ్యున్నతికి పనిచేసిన పార్టీ టీడీపీ అన్నారు. “ఉమ్మడి ఏపీలో జగజ్జీవన్ రామ్ రాష్ట్రమంతటా పర్యటించారు. ఎన్టీఆర్‌తో జగజ్జీవన్ రామ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి ఆయనకు నివాళి అర్పించాం. ఎస్సీ వర్గీకరణతో అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేశాం. ఎస్సీల్లోని అన్ని కులాలకూ సమన్యాయం జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దళితుల సాధికారిత కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

















