- స్మార్ట్ పరిశ్రమలతో ఆదాయం పెంపు లక్ష్యం
- పురపాలక మంత్రి పొంగూరు నారాయణ
- సీఎం చంద్రబాబుకు రైతుల ధన్యవాద సభ
- ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై హర్షం
అమరావతి(చైతన్యరథం): ప్రపంచంలోని ఐదు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని పురపాలక మంత్రి పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. వైకుంఠపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతుల ధన్యవాద సభ శనివారం జరిగింది. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల రైతులను సంతోషపరిచేలా సీఎం చంద్ర బాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ ప్రతిపాదనపై సీఎంతో చర్చిస్తా..
ముఖ్యమంత్రి నిర్ణయంతో ‘థ్యాంక్యూ సీఎం సార’ పేరుతో 4 గ్రామాల రైతులు అభినందన సభ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన సభకు మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములు ఇచ్చేందుకు రైతులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీకి ఇవ్వాలనే ప్రతిపాదనపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. కేవలం రోడ్ల నిర్మాణం కాకుండా అండర్ గ్రౌండ్‌లోనే మౌలిక వసతులు చేపడుతున్నామని వెల్లడిం చారు. అమరావతిలో మాదిరిగా కొత్తగా పూలింగ్ చేస్తున్న గ్రామాల్లో రోడ్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అమరావతికి వరద ముప్పు లేకుండా రిజర్వాయర్లు, కాలువలు డిజైన్ చేశామని వివరించారు. అమరావతికి ఆదాయం వచ్చేలా స్మార్ట్ పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ త్వరగా పూర్తయితే వెంటనే లే ఔట్ డిజైన్ చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
నిర్దేశిత గడువులోగా ఆయా భవనాలు సిద్ధం చేయాలి
అలాగే, అమరావతి భవనాల నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇంజినీర్లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. గవర్న మెంట్ కాంప్లెక్స్‌లో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాసాలు నిర్మాణ పనులపై చర్చించారు. రాజధానిలో ఐకానిక్ భవనాలతో పాటు 4026 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. దాదాపు తుది దశకు పలు భవనాల నిర్మాణాలు చేరుకున్నాయి. నిర్దేశిత గడువులోగా ఆయా భవనాలు, బంగ్లాలను సిద్ధం చేయాలని కాంట్రాక్ట్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.













