- టీడీపీ శిక్షణా తరగతులతో లీడర్-కేడర్ మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ
- పార్టీ ముఖ్యనేతల టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
- ఈనెల 29న పార్టీ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
అమరావతి (చైతన్య రథం): ప్రజలకు సంక్షేమం, ప్రభుత్వ సేవలు, రాష్ట్రాభివృద్ధి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని… కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ సందర్భంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుబాటులోవున్న ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈమేరకు తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా… వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూనే ప్రజలకు సంక్షేమం-అభివృద్ధి అందించే విషయంలో రాజీ పడకుండా పరిపాలన సాగిస్తున్నామని సీఎం అన్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కొందరు ప్రభుత్వం మీద.. కూటమి పార్టీలమీద అబద్దాలాడుతూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా.. వివిధ వ్యక్తులద్వారా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే… వాళ్లే విశ్లేషించుకుంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
పరిపాలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే… ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేలా ప్రజలే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారతారని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో నాటి ప్రభుత్వం ఎంతగా కూటమి పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేసినా… ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి అద్భుతమైన విజయాన్ని అందించారని గుర్తు చేశారు. ప్రజలకు వాస్తవాలను తెలియచేయడమనేది ప్రధాన బాధ్యతనే విషయాన్ని గుర్తించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక టీడీపీ నిర్వహిస్తోన్న ట్రైనింగ్ క్లాసులతోపాటు, కాఫీ కబుర్లువంటి కార్యక్రమాల ద్వారా లీడర్-కేడర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. శిక్షణకు వచ్చే కార్యకర్తలకు పార్టీ ధోరణి, సిద్ధాంతాలను వివరించడంతోపాటు… క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ పథకాల అమలు తీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకునే వీలు కలుగుతోందని సీఎం చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధివంటి అంశాల్లో పార్టీ కార్యకర్తల కుటుంబాల సంక్షేమం కోసం… వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తోన్న వ్యవస్థను సమగ్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంట్లో భాగంగా ఎథిక్ ఎకనమిక్ ఎంపవర్‌మెంట్ తెస్తున్నామని చెప్పారు. ఈనెల 29న పార్టీ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి నేతలు తెలిపారు. మహానాడు నిర్వహణకు సంబంధించిన కమిటీల ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నట్టు సీఎంకు పార్టీ నేతలు వివరించారు.














