- రామాయపట్నం పోర్టు సమీపంలో
- ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి
- రైలు రవాణా 45 శాతానికి పెంపే లక్ష్యం
- మొత్తం నాలుగు దశల్లో అభివద్ధి
- 2027 నాటికి మొదటి దశ పూర్తి
- మూడురాష్ట్రాలకు అందనున్న రవాణా సేవలు
- ఏటా 10 కోట్ల టన్నుల వరకు అవకాశం
- రైలు-రోడ్డు మార్గాల అనుసంధానంతో
- సరకు రవాణా సులభతరం
అమరావతి(చైతన్యరథం): రామాయపట్నం పోర్టుకు అను సంధానంగా రూ.1615 కోట్లతో కార్గో రైల్ టెర్నినల్ ఏర్పాటు కానుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెట్టు సమీపంలో చేవూరు, మోచర్ల గ్రామాల పరిధిలో దీన్ని ఏర్పాటు చేస్తారు. రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట పోర్టు సమీపంలో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. దీనిద్వారా రైలు-రోడ్డు మార్గాలు అనుసంధానమై సరకు రవాణా సులభమవుతుంది. 2027 జనవరి నాటికి ప్రాజెక్టు మొదటిదశ పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యం. 2028 డిసెంబరు వాటికి మిగిలిన మూడు దశలు పూర్తవుతాయి. దీనిద్వారా 1300 మంది కి ఉపాధి లభిస్తుందని అంచనా.
తూర్పుతీరంలో సరకు రవాణాకు డిమాండ్
రామాయపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులు.. విశాఖ -చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడాల అభివృద్ధి తో తూర్పుతీరంలో సరకు రవాణాకు డిమాండ్ పెరుగు తుందని అందనా. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, కర్ణాటక. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరకు రవాణా సేవలు అందనున్నాయి. ప్రాజెక్టులో భాగంగా బల్క్ హ్యాండ్లింగ్, వేర్ హౌసింగ్ సౌకర్యాలు, కోల్డ్ చైన్ మౌళిక సదుపాయాలు, ఆటోమొబైల్, లాజిస్టిక్స్ యార్డు, రసాయనాల నిర్వహణకు ప్రత్యేక జోన్‌లతో ఆధునిక మల్టీమోడల్ కార్గో రైల్ టెర్మినల్ అందుబాటులోకి వస్తుంది.
429 ఎకరాల్లో అభివద్ధి
ఈ ప్రాజెక్టును 429 ఎకరాల్లో నాలుగు దశల్లో సంస్థ అభివృద్ధి చేయనుంది. మొదటి దశలో చేవూరులోని 153.77 ఎకరాల్లో లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. తదుపరి మూడు దశల్లో 275 ఎకరాల్లో మిగతా సౌకర్యాలు సమకూరుస్తుంది. రెండోదశలో రూ.325 కోట్లు, మూడోదశలో రూ.500 కోట్లు, నాలుగో దశలో రూ. 555 కోట్లు సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్రాంతంలో రేక్ నిర్వహణ పాదుర్థ్యం ప్రస్తుతం నెలకు 18 రేక్‌లుగా ఉంది. దీన్ని 135 రేక్‌లకు పెంచేలా ప్రాజెక్టును రూపొందించారు. 2030 నాటికి రైలు రవాణాను 27 శాతం నుంచి 45 శాతానికి పెంచాలన్నదే కేంద్రం ఆలోచన. తద్వారా సరకు రవాణా వ్యయాన్ని తగ్గించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం రోడ్డు మార్గంలో సుమారు 65% వరకు రవాణా అవుతోంది.
ఏటా 10 కోట్ల టన్నుల వరకు రవాణా
కార్గో రైల్ టెర్మినల్ ద్వారా బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఇతర ఉత్పత్తులు కలిపి ఏటా సుమారు 100 మిలియన్(10 కోట్ల) టన్నుల వరకు సరకు రవాణాకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏటా గరిష్ఠంగా 40 ఏంటీల బొగ్గు రవాణాకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పారిశ్రమైన అవసరాలకు బొగ్గు రవాణాకు అవకాశం ఏర్పడుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గడ్, దక్షిణ భారతదేశంలోని మైనింగ్, స్టీల్ క్లస్టర్లకు ఇనుప ఖనిజం, ఉక్కు కార్గో ద్వారా ఏటా గరిష్ఠంగా 25 ఎంటీల వరకు రవాణాకు అవకాశం ఏర్పడుతుంది. దక్షిణ ప్రాంతంలో పట్టణీకరణ, మౌలిక సదుపాయాల వృద్ధి కారణంగా సిమెంట్, క్లింకర్ నిర్మాణ సామగ్రి, గరిష్ఠంగా 15 ఎంటీల మేరకు రవాణాకు అంచనా. వ్యవసాయ, శుద్ది, ప్రాసెసింగ్ పరిశ్రమల నుంచి వచ్చే ఎరువులు, పెట్రోలి యం, రసాయనాలు, ఖనిజాలు సుమారు 20 ఎంటీల రవాణాకు అవకాశం ఉంటుంది. కంటెయినరైజ్డ్..త్వరగా పాడయ్యే కార్గో.. వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు సుమారు 8 ఎంటీల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.















