- పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులకు ఆదేశం
తుని (చైతన్యరథం): కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో ‘పేదల సేవలో’ పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కల్లు గీత కార్మికుడు పోలవరపు సింహాచలం ఇంటిని సందర్శించారు. ఆయనకు స్వయంగా రూ.4 వేల పెన్షన్ సొమ్మును అందజేశారు. సింహాచలం కుటుంబంతో మంచంపై కూర్చుని సీఎం ఆప్యాయంగా ముచ్చటించారు. సింహాచలం మనవడిని అప్యాయంగా ముద్దాడి వారి కుటుంబ యోగక్షేమాలు, పిల్లల చదువులు, ఆదాయ మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో ప్రమాదకరమైన, శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారి జీవన విధానాన్ని అభినందించారు. ఈ క్రమంలో తమకు ఒక శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలని సింహాచలం ముఖ్యమంత్రిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. సింహాచలం కుటుంబానికి తక్షణం పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కి కల్లు గీసే
సంప్రదాయ విధానాన్ని ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. సింహాచలం మేనల్లుడు ముసలయ్య తాటిచెట్టు ఎక్కి
గీసి తెచ్చిన తాజా కల్లును చంద్రబాబు సంప్రదాయబద్ధంగా ఆకు దొన్నెలో రుచి చూశారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి రావడం, తమ వృత్తిని గౌరవించి కల్లు రుచి చూడటమే కాకుండా, పక్కా ఇల్లు మంజూరు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ సింహాచలం కుటుంబ సభ్యులు, స్థానిక గీత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.















