- జిల్లాల్లో పరిష్కారం కాని ఇళ్ల సమస్యలను కేబినెటు తీసుకురండి
- గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై దృష్టి పెట్టండి
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంతవరకు చేయగలరో చేయాలని… కుదరని పక్షంలో కేబినెట్కు తీసుకురావాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆర్టీజీ సెంటర్ నుంచి సీఎం వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మట్లాడుతూ… ‘రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమస్య చాలా కాలంగా పెండింగులో ఉంది. ఏదో ఒక రకమైన సాకు చూపి వాటిని పెండింగులో పెట్టేస్తున్నారు. దీనికి ఫుల్స్టాప్ పెట్టాలి. ప్రతీ జిల్లాలోనూ క్రమబద్ధీకరించాల్సిన ఇళ్లు, ఇళ్ల స్థలాల జాబితాలను సిద్ధం చేయండి. ఈ మేరకు కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోండి. క్రమబద్ధీకరణకు సంబంధించి జిల్లాల స్థాయిలో చేయగలిగినంత మేరకు చేసేయాలి. అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే… కేబినెట్లో పెట్టి వాటి క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంటాం. ఎటువంటి వివాదాల్లేకుండా క్రమబద్ధీకరించతగ్గ స్థలాలను ప్రతి కేబినెట్ కూ తీసుకురావాలి. అప్పటికీ పూర్తి కానివి ఏమైనా ఉంటే… ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారించాలో ఆలోచన చేద్దాం. ఇక గృహ నిర్మాణ శాఖలో పెండింగులో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టాలి. ఈ మేరకు గృహ నిర్మాణం-ఆర్థిక శాఖలు సమన్వయం చేసుకోవాలి.” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు
“ఇసుక అక్రమాలు అస్సలు జరగడానికి వీల్లేదు. ఏపీలో తవ్విన ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదు. రాష్ట్రాల సరిహద్దులు దాటిన వాహనాలను సీజ్ చేయండి. ఈ విషయంలో కఠినంగా ఉండండి. ఇసుక లారీలకు ట్రాకింగ్ పెట్టాలి. ఈ మేరకు టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. ఇసుక అక్రమంగా వేరే ప్రాంతాలకు వెళ్తే… వెంటనే అలెర్ట్ మెసేజెస్ వచ్చేలా మెకానిజం ఉండాలి. ఇప్పటికే 50వేల వాహనాలకు జీపీఎస్ పెట్టి ట్రాకింగ్ చేస్తున్నాం. అక్రమాలు జరగడానికి వీల్లేదు. ఈ మేరకు మైనింగ్ -పోలీసులు కో-ఆర్డినేట్ చేసుకోవాలి. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వం అందించే ప్రతి పథకం, అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కలిగితే.. ప్రభుత్వం అందించే సేవలకు సార్ధకత లభిస్తుంది.
ప్రజల్లోకి వెళ్లాలని… ప్రజలకు వివరించాలని చెప్పేది ప్రచారం కోసం కాదు… ప్రజలకు అవగాహన కల్పించడానికే అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ సేవల పట్ల అవగాహన కలిగితే… ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి పెరుగుతుంది. రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్య ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. వర్క్ ప్లేసులో వేధింపులు ఉండకూడదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. సమస్యలు ఉత్పన్నమయ్యాక చర్యలు తీసుకోవడం కాదు… సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రి పార్థసారధి, సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















