అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర 2026’ సామూహిక ఆరోగ్య, యోగా ఉద్యమానికి అంతర్జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా అపూర్వమైన రీతిలో ప్రజా సమీకరణ, రికార్డుస్థాయి భాగస్వామ్యంతో విజయవంతమైన మెగా కార్యక్రమం లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం దక్కించుకుంది. అంతర్జాతీయ రికార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ -సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉల్లాజి ఎలియాజర్ ముఖ్యమంత్రికి అందజేశారు. అవార్డును ఆయుష్ శాఖకు ఇచ్చి.. అభినందించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అందరి సమస్టి కృషివల్లే ఇది సాధ్యమైందన్నారు.
లక్ష్యాన్ని మించిన రిజిస్ట్రేషన్లు: ‘యోగాంధ్ర
2026’ ద్వారా రాష్ట్రంలో 1.05 కోట్లమంది యోగా ఔత్సాహికులను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆ లక్ష్యాన్ని అధిగమించి ఏకంగా 1.07 కోట్లమంది రిజిస్ట్రేషన్లు చేసుకుని కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్రను సృష్టించింది.
భారీ మానవ వనరుల నెట్వర్క్: యోగాను
క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు 7,745 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు, 2.61 లక్షలమంది సాధారణ యోగా ట్రైనర్లు, 511మంది యోగా గురువులు తమ సేవలను అందించారని ఆయుష్ డైరెక్టర్ రోణశీకి గోపాలకృష్ణ చెప్పారు.
అపారమైన మౌలిక వసతులు
రాష్ట్రవ్యాప్తంగా 1,32,183 కేంద్రాలను గుర్తించి, ఒకేసారి 1.45 కోట్లమంది యోగా సాధన చేసేలా భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే, 26 థీమాటిక్ యోగా ప్రదర్శనల ద్వారా 35,603 మంది, మరియు రాష్ట్రంలోని 55 ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో నిర్వహించిన యోగా ప్రదర్శనలలో 59,458 మంది భాగస్వాములయ్యారు.
గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పోటీలు:
విలేజ్/ వార్డు సెక్రటేరియట్ స్థాయి (1,20,696 పోటీలు) నుండి మొదలుకొని మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల వరకు బహుళంచెల పోటీలను నిర్వహించారు. రాష్ట్రస్థాయి తుది పోటీలలో 372 మంది ప్రతిభావంతులు పోటీ పడగా, 66 మంది విజేతలుగా నిలిచి రాష్ట్ర యోగా పర్యావరణ వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారని ఆయుష్ డైరెక్టర్ గోపాలకృష్ణ వివరించారు..















