- పదవీ విరమణ వయసు 60నుంచి 62కు..
- సీపీఎస్ అసోసియేషన్ హర్షం
- సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్ల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, మెమో-57 ప్రకారం 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 11 వేలమంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీపీఎస్ అసోసియేషన్ హర్షం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ స్వాగతించింది. ఓఎం నెం.57 అమలుపై సీపీఎస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలోని 11 వేలమంది సీపీఎస్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్‌పై స్పష్టతనిచ్చిన సర్కార్.. 2017నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపించింది. ఉద్యోగుల గ్రాడ్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సీపీఎస్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీపీఎస్ అసోసియేషన్ పేర్కొంది.
ఉద్యోగుల కల నెరవేరింది: విద్యాసాగర్
ఏపీ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి మెమో 57 ప్రకారం 11 వేలమంది ఉద్యోగులకు మేలు జరిగిందన్నారు. ప్రభుత్వరంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేబినెట్ నిర్ణయంతో ఈరోజు ఉద్యోగుల కల నెరవేరిందన్నారు. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ అంశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించాలని విద్యాసాగర్ కోరారు.
సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు
కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘ నేతలు సీఎంకు వివరించారు. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో లబ్ది కలుగుతోందని వెల్లడించారు.
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికీ మరువలేమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఉద్యోగులు పని చేయాలని సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, ప్రసాద్, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, నాపా ప్రసాద్ సహా సీపీఎస్, పీఎస్‌యూ ఉద్యోగుల అసోసియేషన్, గురుకుల, సొసైటీలు, డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల సంఘానికి చెందిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియచేశారు.















