- మామిడి రైతు కోసం ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం
- 7.03 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు రూ.281 కోట్లివ్వండి
- ఆర్థిక సహకారం కోరుతూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం-పీడీపీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవడం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్‌లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.281 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 3.99 లక్షల హెక్టార్లలో సాగవుతూ 52.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని చంద్రబాబు వివరించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో దాదాపు 91,011 హెక్టార్లలో తోతాపురి రకం సాగవుతోందని తెలిపారు. దీని ద్వారా 8.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తూ లక్షలాది రైతు కుటుంబాలకు జీవనాధారంగా ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత సీజన్‌లో పెట్టుబడి వ్యయం పెరగడం, మార్కెట్ ధరలు కుప్పకూలడంతో మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని లేఖలో పరిస్థితిని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తున్నట్టు సీఎం లేఖలో వెల్లడించారు. దీంట్లో భాగంగా కిలోకు అదనంగా రూ.4 చొప్పున మామిడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు పీడీపీఎస్ కింద కేంద్రం మద్దతివ్వాలని… ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే ఈ కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంను అమలు చేసేలా చూడాలని కేంద్రమంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి కోరారు.















