- మరింత పటిష్టంగా సమాచార నెట్వర్క్
- డిజిటల్ లిటరసికీ ఆపరేటర్ల సహకారం అవసరం
- నెట్వర్క్ బలోపేతంపై సర్వీసు ప్రొవైడర్లకు ఆదేశాలు
- కమ్యూనికేషన్ నెట్వర్క్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): సమాచార నెట్వర్క్ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్‌ను ఏర్పాటు చేయటం ద్వారా సమాచార వ్యవస్థలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ దిశగా పని చేస్తున్నామని సీఎం వెల్లడించారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్‌ను మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కమ్యూనికేషన్ నెట్వర్క్‌పై సీఎం వివిధ సర్వీసు ప్రొవైడర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మొబైల్ కవరేజీ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా మరిన్ని సెల్ టవర్లను ఏర్పాటు చేయాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,694 సెల్ టవర్లు ఉన్నాయని.. మరో 2310 సెల్ టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం అవసరమైన మేరకు సర్వీసు ప్రొవైడర్‌లకు ప్రభుత్వంనుంచి సహకారం అందిస్తామని తెలిపారు. వంద రోజుల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. భౌగోళికంగా కవరేజి లేని ప్రాంతాల వివరాలను ఇస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ఫైబర్ ద్వారా సమాచార నెట్వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఎక్కడా తవ్వకాలు జరగకుండా ప్రతీ ఇంటికీ ఫైబర్ నెట్వర్క్ అందిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 1,69,638 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్‌తోపాటు 28.67 లక్షల బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
డిజిటల్ లిటరసీకి సహకారం
రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల్లో డిజిటల్ లిటరసీకి కూడా సర్వీసు ప్రొవైడర్లు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా అందిస్తున్న వివిధ సేవలు, సంజీవని పథకం సహా వివిధ టచ్ పాయింట్‌ల సేవల్ని సమర్ధంగా వినియోగించుకునేలా డిజిటల్ లిటరసీ ఉపకరిస్తుందన్నారు. ప్రజలను డిజిటల్ లిటరేట్లుగా మారిస్తే మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కువ సేవలు అందించేందుకు అస్కారం ఉంటుందన్నారు. త్వరలో ఏఐ ఆగ్రానమిస్ట్, ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్‌లాంటి వేర్వేరు సేవల్ని వినియోగదారులు ఉపయోగించుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాతిపదికన అన్ని ప్రాంతాలకూ పూర్తి మొబైల్ కవరేజీ అందిస్తున్నట్టు తెలిపారు. సమీక్షకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, బీఎసఎనఎల్, ఎయిర్ టెల్, జియో, వోడా ఫోన్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.















