- ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి 3 లక్షలమంది హాజరయ్యే అవకాశం
- కూటమి నాయకులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలి
- భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి లోకేష్
భోగాపురం (విజయనగరం జిల్లా): ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. (భోగాపురం)ను ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయవంతం చేయాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పరిశీలించిన అనంతరం సమీక్షించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాలనుంచి 3 లక్షలమంది ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని మోదీజీ బహిరంగసభకు హాజరవుతారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని సభను విజయవంతం చేయాలని కోరారు.
ప్రధాని మోదీజీకి ఘన స్వాగతం పలుకుతూ సుమారు 13 వేలమందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలి. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరయ్యే ప్రజలకోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేల బస్సులు రానున్నాయి. సభకు వచ్చేవారు బస్సు ఎక్కినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు ఎటువంటి లోటులేకుండా మండలస్థాయి లైజన్ ఆఫీసర్లు దగ్గరుండి చూసుకోవాలి. సభకు హాజరయ్యే వారందరికీ తాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయం కల్పించాలి. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ ముఖ్య అధికారి ఎంటి కృష్ణబాబు మాట్లాడుతూ… ప్రధాని బహిరంగసభను వీక్షించేందుకు ప్రతి 5వేలమందికి ఒక ఎల్ డి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
సమీక్షా సమావేశంలో మంత్రులు వంగలపూడిఅనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారి రాజేష్, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఎంపి చింతకాయల విజయ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కార్యక్రమాల కమిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు (విజయనగరం), కళా వెంకట్రావు (చీపురుపల్లి), కోండ్రు మురళీమోహన్ (రాజాం), లోకం నాగమాధవి (నెల్లిమర్ల), విఎంఆర్ డిఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎంటి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్, విజయనగరం కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండి ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ ఎంఎం నాయక్, ఏపీ గిరిజన కార్పొరేషన్ ఎండి ఎస్ఎస్ శోభిక, విశాఖపట్నం రేంజి ఐజీ గోపినాథ్ జెట్టి. రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, విజయనగరం ఎస్పీ దామోదర్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డైరక్టర్ భార్గవి, ప్రోటోకాల్ (జిఏడి) డైరక్టర్ మోహన్ రావు, విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి
నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
















