- ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
- మంత్రులు, జోనల్ పరిశీలకులతో సమీక్ష
- బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఆయన అమరావతిలో మంత్రులు, జోనల్ పరిశీలకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాల్వను విజయవంతంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబును నేతలు అభినందించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…. “గత అసెంబ్లీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మరింత మెరుగైన (స్ట్రైక్ రేట్ సాధించాలి. కూటమిగా స్థానిక ఎన్నికలను ఎదుర్కొనడం టీడీపీకి ఇదే మొదటిసారి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు, గ్యాప్ రాకూడదు. ఎన్డీఏ పార్టీలతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో యువతకు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
ప్రజలు, కార్యకర్తల ఆమోదంతో పాటు నాయకుల పనితీరు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. “అవసరమైతే 34 శాతానికి మించి సీట్లు ఇస్తామే తప్ప, ఒక్క శాతం కూడా తగ్గించే ప్రసక్తే లేదు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కొందరు కోర్టులను ఆశ్రయించారు. ‘సర్’ ప్రక్రియ పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించకూడదని ప్రతిపక్ష గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి కుతంత్రాలు పన్నుతోంది. రాష్ట్రానికి కేంద్ర నిధులు రాకుండా అడ్డుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం” అని విమర్శించారు. కాగా పార్టీ నాయకత్వ పటిమను పెంపొందించేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
















