మంగళగిరి (చైతన్య రథం): దశాబ్దాలుగా వారు అక్కడే నివసిస్తున్నారు. నానా కష్టాలుపడి ఇళ్లు నిర్మించుకున్నారు. సొంత ఇంట్లోనే ఉంటున్నా ఏదో తెలియని భయం. కష్టం వస్తే ఇల్లు అమ్మలేరు. ఎవరూ కొనరు. రుణం తీసుకుందామంటే యాజమాన్య పత్రాలు లేని దుస్థితి. సొంతింటి కల సాకారమైనా… హక్కులు లేక దిక్కులు చూస్తున్న మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు.. నాడు నారా లోకేష్ ఇచ్చిన హామీ నేడు పరమైంది. ఎన్నో అడ్డంకులను అధిగమించి, న్యాయపరమైన వివాదాలు పరిష్కరించి.. పేదలకు హక్కు కల్పించే ఒక మహా యజ్ఞం చేపట్టారు మంత్రి నారా లోకేష్ ఇప్పటివరకు వేలాదిమందికి వేల కోట్ల విలువైన ఆస్తి హక్కులు కల్పించిన కార్యక్రమం “మన ఇల్లు-మన లోకేష్”. సోమవారం తాడేపల్లి మండలం కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్లో పట్టాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ చేతుల మీదుగా జరగనుంది.
మరో 372మందికి పట్టాలు అందజేయనున్నారు.
గత ఎన్నికల సమయంలో 2029లోగా నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న ప్రతి లబ్దిదారుడికీ పట్టాలు అందజేస్తానని యువనేత లోకేష్ హామీ ఇచ్చారు.
ఆ మాట మేరకు ఇప్పటికే దాదాపు 80శాతం వరకూ పట్టాల సమస్యను పరిష్కరించారు. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడివున్న మరికొన్ని భూముల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. వాటిపైనా కేంద్ర పెద్దలతో మంత్రి లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్… తొలివిడతగా గతఏడాది ఏప్రిల్ నెలలో 3,002 మందికి, రెండోవిడత ఈ ఏడాది జులై నెలలో 2,634మందికి బట్టలు పెట్టి మరీ పట్టాలు అందజేశారు. మొదటి, రెండు విడతల్లో దాదాపు రూ.2వేల కోట్లు విలువైన భూములకు రూపాయి ఖర్చులేకుండా లబ్ధిదారులకు ఉచితంగా శాశ్వత పట్టాలను అందజేశారు.
మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అటవీ, ఇరిగేషన్, రెవిన్యూ, దేవాదాయ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన భూముల్లో పేదలు దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి చెందిన ఆక్రమిత భూములు కావడంతో వీటికి ఎటువంటి పట్టాలు లేవు. అటువంటి వారికి పట్టాలు ఇప్పిస్తానని ఎన్నికలకు ముందు ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. నాడు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ పలుమార్లు సంప్రదింపులు జరిపి, కేబినెట్ వరకు తీసుకెళ్లి శాఖలవారీగా స్థలాల సమస్యను పరిష్కరించారు. యువనేత లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.















