- రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం
- యువగళంలో రైతుల కష్టాలు చూశాకే హార్టికల్చర్ హబ్ ఆలోచన
- ఇతర రాష్ట్రాలకు కాదు…ఇతర దేశాలకు కావాల్సిన వెరైటీలు పండిద్దాం
- రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి తెలిసేలా చేద్దాం
- హార్టికల్చర్ హబ్-ఐఎసఏ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
మదనపల్లె (చైతన్యరథం): ‘హైదరాబాద్‌లో ఐఎస్బీ తరహా మ్యాజిక్ ఇప్పుడు రాయలసీమలో జరగబోతోంది. ఇక్కడకు రాబోయే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH)-ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) వ్యవసాయరంగ రూపురేఖలు మార్చబోతోంది’ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ -ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లతో కలసి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విత్తనం దగ్గర నుంచి ఉత్పాదకత, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్, యాంత్రీకరణ, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వరకు ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. ఇక్కడ పండించిన పండ్ల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడే మన రైతులకు లాభం వస్తుంది. హార్టికల్చర్ హబ్ లక్ష్యం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే. మనం కేవలం ఇతర రాష్ట్రాలకు కావాల్సిన వెరైటీలనే కాకుండా ఇతర దేశాలకు అవసరమైన రకాల పంటలు కూడా పండించాలి. అందుకు అనుగుణంగా మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, స్వీట్ ఆరెంజ్, అవకాడో, ఆపిల్, బెర్రీస్ వంటి ప్రతి వెరైటీకి సంబంధించి రీసెర్చ్ జరగాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
పోరాటాల పుట్టినిల్లు మదనపల్లె
త్యాగానికి, పోరాటానికి పుట్టినిల్లు మదనపల్లె. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో గాంధీజీ మదనపల్లె వచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యధిక విరాళాలు ఇచ్చింది మదనపల్లె ప్రజలే. బ్రిటిష్ వారి అరాచకానికి వ్యతిరేకంగా పోరాడి లాఠీ దెబ్బలు తిన్నది బీటీ కాలేజీ విద్యార్థులు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన గేయాన్ని బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి అనువదించింది బీటీ కాలేజీలోనే. జనగణమనకు ట్యూన్ కట్టింది కూడా మన బీటీ కాలేజీలోనే. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న పుణ్యభూమి మదనపల్లె.
రైతుల తరపున పోరాడిన గాంధీజీ
అక్టోబరు 2 గాంధీజీ పుట్టినరోజు. మనకు స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఇచ్చిన గొప్ప వ్యక్తికి నివాళులు అర్పిద్దాం. గాంధీజీ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాల గురించే మనం ఎక్కువ మాట్లాడతాం. కానీ ఆయన రైతుల కోసం చేసిన పోరాటాల గురించి మనం మాట్లాడం. చంపారన్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం, గ్రామ స్వరాజ్యం.. ఇలా రైతుల తరపున అనేక పోరాటాలు చేశారు గాంధీజీ. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మింది గాంధీజీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎలా బతకాలో ప్రజలకు నేర్పింది గాంధీజీ.
యువగళంలోనే మిషన్ రాయలసీమ ఆలోచన
నేను యువగళం పాదయాత్ర ప్రారంభించిన గడ్డ రాయలసీమ గడ్డ. ఆనాడు గొడ్డలి పార్టీ వాళ్లు నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు, సోడా బాటిళ్లు, రాళ్లు, గుడ్లతో దాడి చేశారు. అయినా రాయలసీమలో 124 రోజులు, 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,587 కి.మీ. పాదయాత్ర చేశానంటే దానికి కారణం సీమ ప్రజలు నాపై చూపించిన ప్రేమ, అభిమానం. ప్రతిరోజూ రైతుల్ని కలిశాను, వాళ్లు పడుతున్న కష్టాలను నేరుగా చూశాను. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్‌ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, అవకాడో పండిస్తున్న అనేక మంది రైతులతో మాట్లాడాను. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను. యువగళం పాదయాత్ర 119వ రోజైన 2023 జూన్ 7న కడపలో ‘మిషన్ రాయలసీమ’ ప్రకటించాను.
హార్టికల్చర్ హబ్ కల నిజం కాబోతోంది
అందులో ప్రధానమైనది రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చడం. విత్తనం దగ్గర నుంచి ప్రపంచానికి కావాల్సిన వెరైటీలను మనం పండించడమే మిషన్ రాయలసీమ లక్ష్యం. రైతుల ఆదాయం పెంచాలన్న అజెండాతో ఆనాడు మిషన్ రాయలసీమ ప్రకటించాను. ఇప్పుడు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో హార్టికల్చర్ హబ్ కల నిజం కాబోతోంది. ఒక రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబుకి రైతు కష్టం తెలుసు. ఇప్పుడు అందరం డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాం. నీటి విలువ తెలిసిన వ్యక్తి మన చంద్రబాబు. అందుకే 1997లోనే సీమకు ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ పరిచయం చేశారు. ఆ బిందు సేద్యమే కరువు నేలను బంగారు భూమిగా మార్చింది. సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందించిన వ్యక్తి చంద్రబాబు.
అందుకే చంద్రబాబు వాటర్ మ్యాన్!
మొన్న ఒక ఇంగ్లీష్ పేపర్లో చంద్రబాబు గురించి వాటర్ మ్యాన్ అని రాశారు. అది చూసి గొడ్డలి పార్టీ వాళ్లు ఏడుస్తున్నారు. నేను వాళ్లని మూడు ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా. సీమ రైతుకి వరంలాంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసింది ఎవరు? పట్టిసీమ ప్రాజెక్టుతో ఎటువంటి ఉపయోగం లేదన్నది ఎవరు? పోలవరం ప్రాజెక్టు అర్థం కాలేదు-మీకు ఏం అర్థమవుతుంది అన్నది ఎవరు? గొడ్డలి పార్టీ కాదా? నీటిని దేవుడిలా-ఇరిగేషన్ ప్రాజెక్టులను దేవాలయంలా భావించేది చంద్రబాబు. సీమ ప్రాజెక్టులను ప్రారంభించింది మనమే, పూర్తి చేయబోయేదీ మనమే. తెలుగు గంగ, ఎసఆర్బీసీ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, పోలవరం మన ట్రేడ్ మార్క్. ఈ ప్రాజెక్టుల వల్లే రాయలసీమ అరటి వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఈ ప్రాజెక్టుల వల్లే కరువు నేలపై కియా కార్లను మనం తయారు చేస్తున్నాం. అందుకే ఆయన్ని అందరూ వాటర్ మ్యాన్ అంటున్నారు.
బాబు ముందుచూపునకు నిదర్శనం ఐఎస్బీ
హార్టికల్చర్ అయినా, క్వాంటం అయినా చంద్రబాబు ముందుంటారు. మనం ఈ రోజు గురించి ఆలోచిస్తే… చంద్రబాబు వచ్చే 20 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. దానికి ఒక ఉదాహరణే-ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దేశంలో ఉన్న గొప్ప పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి వరల్డ్ క్లాస్ బిజినెస్ స్కూల్ పెట్టాలి అనుకున్నారు. ఆ విషయం బాబుకి తెలిసింది. వాళ్లు దేశం మొత్తం తిరుగుతున్నారు. హైదరాబాద్ రావాలనే ఆలోచనలో అసలు లేరు. కానీ ఐఎస్బీని ఏపీకి తీసుకురావాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఐఎస్బీ బోర్డుని అప్రోచ్ కాగా, వాళ్లు ఏపీ అసలు మా కన్సిడరేషన్లోనే లేదన్నారు. అప్పుడు చంద్రబాబు వాళ్లని ఒకసారి హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు. సీఎం, మంత్రులు ఎయిర్‌పోర్టుకి వెళ్లి ఆహ్వానం పలికారు. స్వయంగా సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ముంబయి, హైదరాబాద్, చెన్నై, కర్ణాటక అన్నిచోట్లకీ వాళ్లు వెళ్లారు. ఫైనల్‌గా హైదరాబాద్‌నే సెలెక్ట్ చేసుకున్నారు. దటీజ్ బ్రాండ్ సీబీఎన్. ఇప్పుడు ఐఎస్బీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ స్కూల్.
చంద్రబాబుతో అంబానీలది మూడు తరాల అనుబంధం
‘చంద్రబాబుకి, అంబానీ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం మూడు దశాబ్దాల నాటిది. ధీరూభాయ్ అంబానీతో ఆయనకున్న అనేక పరిచయాల నుంచి, ముఖేష్ అంబానీతో ఉన్న బంధం వరకు, ఇప్పుడది తర్వాతి తరంతో కొత్త భాగస్వామ్యంగా ఎదిగింది. ఐఎస్బీ వ్యాపార రంగానికి ప్రపంచ స్థాయి సంస్థగా ఎలా మారిందో, మీ నాయకత్వంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మన రైతుల కోసం ప్రపంచ స్థాయి సంస్థగా మారుతుంది. ఈ సంస్థను నిర్మించడానికి మీరు ఇచ్చిన కట్టుబాటుకు, అంతకంటే ముఖ్యంగా ఆంధ్రా రైతుల సామర్థ్యంపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాయలసీమ రైతును ఆంధ్రప్రదేశ్ పొలాల నుంచి ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్దాం. రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి తెలిసేలా చేద్దాం’ అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
















