- సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకెళ్లాలి
- భారత అభివృద్ధికి వచ్చే 20 ఏళ్లు అత్యంత కీలకం
- ప్రజలతో నిరంతర అనుసంధానమే మంచి నాయకత్వ లక్షణం
- పాల్కీ శర్మతో ఫైర్ సైడ్ ఛాట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం (చైతన్య రథం): సమర్థ నాయకత్వం, దూరదృష్టి, సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకెళ్లే ఆలోచన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కిందని, 1990 తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మతో జరిగిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
తాను తొలినాళ్లలోనే ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని, దాని వల్ల హైదరాబాద్‌తో పాటు తెలుగు ప్రజలకు అంతర్జాతీయంగా కొత్త గుర్తింపు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనిపిస్తున్నారని, ప్రతి దేశంలోని ఐటీ సంస్థల్లో తెలుగువారు ఉన్నారని చెప్పారు.
తెలుగువారు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదన్నారు. చాలా ఐటీ సంస్థలకు భారత సంతతికి చెందినవారే నాయకత్వం వహిస్తున్నారని, నైపుణ్యం కలిగిన యువత అధికంగా ఉండటం దేశానికి శుభసూచకమని తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో తన తొలి సమావేశం గురించి చంద్రబాబు ఆసక్తికరంగా వివరించారు. గతంలో రాజకీయ నాయకులతో సమావేశమయ్యేందుకు బిల్ గేట్స్ పెద్దగా ఆసక్తి చూపలేదని, ఆయనతో భేటీ కోసం కొన్ని వారాల పాటు ప్రయత్నించాల్సి వచ్చిందన్నారు. తొలుత పది నిమిషాల సమయం మాత్రమే ఇచ్చినా, చివరకు 45 నిమిషాల పాటు చర్చించారని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటు చేయడానికి బిల్ గేట్స్ అంగీకరించడం గేమ్ ఛేంజర్‌గా మారిందని చెప్పారు.
డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పు లేదు
డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణంపై ప్రభావం పడుతుందన్న విమర్శలను పాల్కీ శర్మ ప్రస్తావించగా, ముఖ్యమంత్రి స్పందించారు. డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, నీటి వినియోగంపై కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గోదావరి జలాల్లో ప్రతి ఏడాది సుమారు మూడు వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని చెప్పారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా విశాఖపట్నానికి వంద టీఎంసీల నీటిని తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. డేటా సెంటర్లకు సుమారు 3.5 టీఎంసీల నీరు అవసరమవుతుందని, గోదావరి జలాలను వినియోగించుకుంటే డేటా సెంటర్లతో పాటు తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకూ సమృద్ధిగా నీటిని అందించవచ్చని తెలిపారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ను కూడా గ్రీన్ ఎనర్జీ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
జనాభా విధానంపై ఆలోచనల్లో మార్పు
డెమోగ్రాఫిక్ డివిడెండ్, జనాభా విధానంపై తన ఆలోచనలను అమలు చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు. గతంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలని తాను సూచించానని, అయితే వివిధ దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన తర్వాత తన ఆలోచనలను మార్చుకున్నానని చెప్పారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని తాను సూచిస్తున్న విధానాన్ని అమలు చేయడం సులభం కాదని అంగీకరించారు. అయినప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన విషయాన్ని చెబుతూనే ఉంటానన్నారు.
దేశానికి మోదీ సరైన నాయకుడు
జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీలతో పొత్తులు, సైద్ధాంతిక విభేదాల గురించి పాల్కీ శర్మ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. 1991కు ముందు లెఫ్ట్‌వింగ్, రైట్‌వింగ్ వంటి రాజకీయ ధోరణులు బలంగా ఉండేవని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని చెప్పారు. ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధే ఇప్పుడు ప్రధాన అజెండాగా మారాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని నరేంద్ర మోదీనే సరైన ఎంపిక అని, ఆయన సరైన నాయకుడని స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధికి రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకమని, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని అన్నారు.
ఓట్ల తొలగింపుపై అపోహలు వద్దు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్)పై వస్తున్న ఆందోళనలు, విమర్శలపైనా ముఖ్యమంత్రి స్పందించారు. ప్రతి 20 నుంచి 25 ఏళ్లకోసారి ఎసఐఆర్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు తొలగిపోయిందంటూ ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీకి గ్రామస్థాయిలో నెట్వర్క్ ఉంటుందని, దాన్ని సమర్థంగా వినియోగించుకుంటే ఏ ఒక్క ఓటూ మిస్ కాకుండా చూసుకోవచ్చన్నారు. ఓట్ల తొలగింపుపై వస్తున్నవి అపోహలేనని, అవి వాస్తవాలు కావని పేర్కొన్నారు. అపోహల ఆధారంగా రాజకీయం చేయడం సరికాదన్నారు.
ప్రజలతో నిరంతర అనుసంధానమే నాయకత్వం
యువతతో పాటు ప్రజల ఆలోచనా విధానాల్లో వస్తున్న మార్పులపై పాల్కీ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రజలతో నిరంతరం మమేకమై ఉండాలని చంద్రబాబు చెప్పారు. వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఆందోళనలకు అవకాశం ఉండదన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలతో నిరంతర అనుసంధానం, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే మంచి నాయకత్వ లక్షణాలని పేర్కొన్నారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఎక్కువ దృష్టి పెట్టి రాజకీయ అంశాలను తక్కువగా పట్టించుకున్న సందర్భాలున్నాయని చంద్రబాబు అంగీకరించారు. ఏదో ఒకటి చేయాలనే తపనతో పరిపాలనపైనే ఎక్కువగా దృష్టి సారించడం వల్ల ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. రాజకీయాలు, పరిపాలన మధ్య సమతుల్యత లోపించడమే అందుకు కారణమన్నారు. ఈసారి ఆ రెండింటి మధ్య సమన్వయం పాటిస్తున్నామని, గతంలో ఎదురైన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. జనసేన, బీజేపీలతో కూటమిగా చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ 25 శాతానికే పరిమితమైందని పేర్కొన్నారు.
విపత్తుల ప్రభావం తగ్గించేందుకు చర్యలు
కొన్ని సందర్భాల్లో తమ ప్రమేయం లేకుండానే సమస్యలు ఎదురవుతాయని, వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రభావం దేశంతో పాటు రాష్ట్రంపైనా పడిందని, దాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. తుఫాన్లు, ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తుల ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. మహిళల పట్ల కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారని, వారిని వేధించే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు.




















