- పెట్టుబడులు వేగంగా కార్యరూపం దాల్చేలా నిరంతర పర్యవేక్షణ
- 2024 జూన్ నుంచి వచ్చిన పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ
- పరిశ్రమల అనుమతులకు సెల్ఫ్ సర్టిఫికేషన్… రియల్ టైమ్‌లో క్లియరెన్స్‌లు
- మొత్తం రూ.32.49 లక్షల కోట్లకు చేరిన రాష్ట్ర పెట్టుబడి ప్రతిపాదనలు
- 25 సెక్టోరల్ పార్కుల ఏర్పాటు… ఎంఎసఎంఈలకు మరింత ప్రోత్సాహం
- టెక్నాలజీ అర్థం కాకుండా విమర్శించేవాళ్లు ముందు నేర్చుకోండి
- సీఐఐ భాగస్వామ్య సదస్సు అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (చైతన్య రథం): పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కుదుర్చుకున్న ఎంఓయూల అమలు పురోగతిపై ప్రతి ఏడాది ఆడిట్ రిపోర్ట్ విడుదల చేస్తామని ప్రకటించారు. 2024 జూన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకువస్తామని, ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్టును రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపుతామని తెలిపారు. విశాఖపట్నంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. సెల్ఫ్ సర్టిఫికేషన్‌తోనే ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన అనుమతులను రియల్ టైమ్‌లో అందిస్తున్నామని వెల్లడించారు. ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
అమలులోకి ఎస్క్రో ఖాతా
పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపుల్లో విశ్వసనీయత, పారదర్శకత ఉండేలా ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఈ ఖాతా నవంబరు 12 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎంఎసఎంఈలకు అందించే ప్రోత్సాహకాలను కూడా ఇదే ఖాతా ద్వారా చెల్లిస్తామని వెల్లడించారు. 2024 జూన్ నుంచి తాజా సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు వరకు రాష్ట్రానికి 714 ప్రాజెక్టులకు సంబంధించి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు. వీటి ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందన్నారు. వీటిలో 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాల ఆమోదం లభించిందని, రూ.17.10 లక్షల కోట్ల పెట్టుబడితో 12.9 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఇప్పటివరకు 303 ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభమైన లేదా నిర్మాణానికి సిద్ధమైన దశకు చేరుకున్నాయని చెప్పారు. వీటి విలువ రూ.7.30 లక్షల కోట్లు కాగా, 7.7 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందన్నారు. సదస్సుకు ముందు ఐదు దేశాల్లో, అలాగే దేశంలోని ఆరు నగరాల్లో మొత్తం 11 పెట్టుబడి రోడ్‌షోలు నిర్వహించామని తెలిపారు.
విశాఖలో ఏఐ, డేటా సెంటర్లు, కాకినాడలో సముద్ర ఆధారిత పరిశ్రమలు, అమరావతిలో క్వాంటమ్, అనంతపురంలో రక్షణ రంగం, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌పై ప్రాంతీయ సదస్సులు నిర్వహించామన్నారు. అక్టోబరు 7 నుంచి 26 వరకు జరిగిన ప్రాంతీయ సదస్సుల్లో 194 ఒప్పందాలు కుదిరాయని, వీటి విలువ రూ.86,522 కోట్లు కాగా, 1,47,951 ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. నవంబరు 12, 13 తేదీల్లో విశాఖలో జరిగిన ప్రధాన సదస్సులో 109 ఒప్పందాలు కుదిరాయని, రూ.9,02,434 కోట్ల పెట్టుబడులతో 2,00,358 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడిందని వివరించారు. ప్రాంతీయ సదస్సులు, ప్రధాన సదస్సు కలిపి 303 కొత్త ఒప్పందాలు, సుమారు రూ.9,88,957 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు, 3,48,309 ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. దీంతో 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై, పారిశ్రామిక విధానాలపై ఉన్న విశ్వసనీయత కారణంగానే కియా సంస్థ మరో ప్లాంటు విస్తరణకు ముందుకొచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. విశ్వసనీయత అనేది రాత్రికి రాత్రే రాదని, దశాబ్దాల కృషి వల్లే వస్తుందన్నారు. రూ.18,878 కోట్ల పెట్టుబడితో పెనుకొండ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు లక్షల వాహనాల మేర పెంచేందుకు కియా ముందుకొచ్చిందని, దీని ద్వారా అదనంగా 12 వేల ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పారు. గతంలో కియా సంస్థకు భూమి, నీరు అందించడం ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు సహకరించామని, ఇప్పుడు ఆ సంస్థ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక ప్రగతి
గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పారిశ్రామిక రంగంలో ప్రభావవంతమైన మార్పు కనిపిస్తోందని సీఎం అన్నారు. రాష్ట్రంలో 25 సెక్టోరల్ పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంఎసఎంఈలను ప్రోత్సహించడంతో పాటు భారీ పరిశ్రమలకు అనుసంధానించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎంఎసఎంఈలకు మద్దతు అందిస్తామని, వివిధ రంగాలకు ఉపయోగపడేలా ఉమ్మడి సదుపాయాల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భూములు తీసుకుని పరిశ్రమలు స్థాపించని వారి విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. క్వాంటమ్ కంప్యూటర్లను రాష్ట్రంలోనే తయారు చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, భవిష్యత్తులో మేడ్ ఇన్ అమరావతి క్వాంటమ్ కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో ఐటీ, పర్యాటక రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు డేటా సెంటర్లు, ఏఐ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
టెక్నాలజీతో అసాధ్యాలు సైతం సుసాధ్యం
ఉపగ్రహాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు, అంతరిక్షం నుంచి విద్యుత్ ఉత్పత్తి వంటి వినూత్న అంశాలపై అధ్యయనాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. అంతరిక్షం నుంచి విద్యుత్ అందిస్తామంటే ఎగతాళి చేస్తున్నారని, తుపాను విషయంలోనూ ఇలాగే అన్నారని చెప్పారు. అయితే తుపాను అతలాకుతలం చేసిన తర్వాత టెక్నాలజీని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ల నోళ్లు మూతపడ్డాయన్నారు. టెక్నాలజీ అర్థం కాకుంటే నేర్చుకోవడం మంచిదని, ప్రస్తుతం టెక్నాలజీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేసేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో వ్యవసాయ రంగానికి ఏఐ స్టాక్ రూపొందిస్తున్నామని, రైతులకు అవసరమైన సలహాలు అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మొండలీజ్ సంస్థతో కలిసి కోకో మిషన్ ఏర్పాటు చేస్తున్నామని, అరకు కాఫీ ఉత్పత్తి, ప్రచారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. స్కిల్ సెన్సస్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను గుర్తించి, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయాల నుంచి ఐటీఐలు, పాలిటెక్నిక్ సంస్థల వరకు అన్నింటినీ అనుసంధానిస్తామని తెలిపారు.
మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి ప్రాధాన్యత
రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన, జల రవాణా అనుసంధానాన్ని మరింత పెంచుతామని ముఖ్యమంత్రి తెలిపారు. నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతలని చెప్పారు. ప్రతి జిల్లాలోని ప్రతి ప్రాంతానికి నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. వ్యవసాయంతో పాటు సేవారంగం, రవాణా, సరకు నిర్వహణ రంగాల అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు అవసరమని, పెట్టుబడులు ఆకర్షించాలంటే మెరుగైన విధానాలు ఉండాలని సీఎం అన్నారు. దీనికి అవసరమైన విధానాలను తీసుకొచ్చామన్నారు.
రూ.1కే ఎకరం భూమి ఇస్తే చాలా విమర్శలు వచ్చాయని, కానీ పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలని, పొరుగు రాష్ట్రాల మధ్య సమన్వయం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. తుపాన్ల సమయంలో పొరుగు రాష్ట్రాల సాయం కోరగా, అవి సహకరించాయని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే నదుల అనుసంధాన ప్రతిపాదన తెచ్చామన్నారు. పరస్పరం సహకరించుకుంటూనే అభివృద్ధి విషయంలో పొరుగు రాష్ట్రాలతో పోటీపడతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సహకారం లభిస్తోందని, కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో అభివృద్ధి సాధించాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయమని చెప్పారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని, 2019–24 మధ్య కాలంలో విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
విశాఖ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
విశాఖలో ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంటును పునరుద్ధరించామని, అనకాపల్లిలో స్టీల్ సిటీ వస్తోందని చెప్పారు. విశాఖ నుంచి వివిధ దేశాలకు సముద్రగర్భ కేబుళ్లు వేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖకు వచ్చే ప్రతినిధులు నగర వాతావరణం, ప్రజల ఆతిథ్యంతో సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. అరకు అందాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తామని, వచ్చే భాగస్వామ్య సదస్సుకు వచ్చే ప్రతినిధులను అరకు లోయకు తీసుకెళ్తామని చెప్పారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల ఆకర్షణతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు, వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడులు, విజ్ఞాన భాగస్వామ్యానికి ఈ సదస్సు వేదికగా నిలిచిందన్నారు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు భరత్, తెన్నేటి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




















