- ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేశాం
- ఇన్స్యూరెన్స్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ నేతల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చైతన్య రథం) ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశు
ద్ధితో పని చేస్తూనే ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ప్రతినిధులు కలిశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ “సీపీఎస్ రద్దు కోసం దశాబ్ద కాలంగా ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసింది.
గతంలో కొంతమంది హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. తెలియక హామీలిచ్చామంటూ మాట మార్చారు. కానీ మేము అలా కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు న్యాయం చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులకు అండగా నిలిచే లక్ష్యంతో సీపీఎస్ రద్దు చేశాం. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో కూడా ఓపీఎస్ అమలు కావాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్, జాయినింగ్స్ ఆలస్యం కారణంగా.. కొంత జాప్యమవుతోంది. అయినప్పటికీ.. అందరికీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంది” అని భరోసానిచ్చారు. “రాష్ట్రంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంది. అందరూ కలిసి సమిష్టిగా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే తపన తో పని చేస్తున్నాం. తాజాగా విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
గతంలో వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 76 శాతం గ్రౌండ్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తే.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తున్నాం. పెట్టుబడులతో వచ్చే వారికి కూడా భద్రత కల్పించే లక్ష్యంతో చట్టం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇండస్ట్రీస్‌కి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కూడా ఎస్క్రో అకౌంట్ పెట్టి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ కారణంగానే ఇంతటి విజయాన్ని సాధించగలుగుతున్నాం. అన్ని రంగాల్లో సమస్యల్ని పరిష్కరించుకుంటూ అభివృద్ధి బాటలో అడుగులు వేస్తున్నాం. త్వరలోనే ఎల్.ఐ.సి సమస్య కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కేంద్రం తో చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం” అని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.


















