- నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు
- రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు
- మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ఏడాది కాలానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధరల తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకోవాలని సూచించారు. ధరల నియంత్రణపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిత్యావసర వస్తువుల ధరలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
డిసెంబర్ 1నుంచి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ పంపిణీ ప్రారంభించనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రికి వివరించారు. కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమ పిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125 చొప్పున అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35కు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ధరణి బ్రాండ్‌తో రైతు బజార్లలో సరసమైన ధరలకు విక్రయిస్తున్న బియ్యానికి మంచి ఆదరణ లభిస్తోందని వివరించారు. బహిరంగ మార్కెట్లోనూ బియ్యం ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం హోల్‌సేల్ బియ్యం వ్యాపారులు, మిల్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. మొబైల్ వాహనాల ద్వారా కూడా సరసమైన ధరలకు బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు, రైతు బజార్లు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ధరల నియంత్రణపై సమీక్షలు నిర్వహించే విధానం కాకుండా, నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కాలానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, ప్రతి వారం సమీక్షించాలని ఆదేశించారు. ధరల నియంత్రణ చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు. పంటలు పండించే రైతులకు నష్టం రాకూడదని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరాలకు అనుగుణంగా, సరైన సమయంలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంటే బహిరంగ మార్కెట్లోనూ ధరలను తగ్గించవచ్చన్నారు. మార్కెట్ డిమాండ్, ధరల సరళిని బట్టి వివిధ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు సకాలంలో మార్కెట్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కందిపప్పు ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వ జోక్యాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులు కందిపప్పు సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. నాసిక్ రకం ఉల్లిపాయల సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుకూలమైన ప్రాంతాల్లో రైతులు ఈ రకం ఉల్లిపాయలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ధరల నియంత్రణ కోసం మార్కెట్ జోక్యానికి ప్రభుత్వం ఖర్చు చేసేందుకు వెనుకాడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్ జోక్యం కోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని బియ్యం నిల్వలు
అక్రమ మార్గాల్లో ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ధరలను అదుపులో ఉంచేందుకు నిరంతర మార్కెట్ పర్యవేక్షణతో పాటు అగ్రి-వాచ్ ద్వారా వ్యూహాత్మక జోక్యాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర వస్తువులతోపాటు కూరగాయల ధరలు కూడా పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో రైతు బజార్లు కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. ధరల నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్లతో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.




















