అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. శంకుస్థాపన జరిగిన కేవలం 12 నెలల్లోనే పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభం కావడం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’కు నిదర్శనంగా అభివర్ణించారు. ఈ ప్లాంట్‌లో కాంపా కోలా, పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ తాగునీటి ఉత్పత్తి ప్రారంభమైందని లోకేష్ వెల్లడించారు. తరతరాల భారతీయుల జ్ఞాపకాలతో ముడిపడిన స్వదేశీ బ్రాండ్ కాంపా కోలా రాయలసీమ గడ్డపై పునర్జన్మ పొందుతోందని, ఇక్కడి నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించనుందన్నారు. అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడే సత్తా స్వదేశీ సంస్థలకు ఉందని పేర్కొన్నారు.
ఈ పరిశ్రమ ద్వారా స్థానికులకు 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని, రవాణా, వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. నంద్యాలకు చెందిన మహేష్ హరి, కర్నూలుకు చెందిన ఆర్.కె. స్ఫూర్తి వంటి యువత తమ ప్రాంతంలోనే ప్రపంచస్థాయి పరిశ్రమలో ఉద్యోగాలు పొందడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, ఉద్యోగాలే యువతను వెతుక్కుంటూ వచ్చేలా రాయలసీమను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో భారీ పరిశ్రమను ఏర్పాటు చేసిన రిలయన్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇలాంటి మరిన్ని పారిశ్రామిక విజయగాథలు ఆవిష్కృతం కావాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.



















