- ఏపీలో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ సంస్థల వివరాలతో ఎక్స్‌లో పోస్టు
- ప్రాజెక్టులను అడ్డుకునేందుకు పిల్లు వేసి.. మళ్లీ వాటి ఘనత తమదేనంటున్నారంటూ విమర్శలు
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వ పనితీరును, వైసీపీ హయాంలోని పరిస్థితులను పోలుస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలు ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయని లోకేశ్ పేర్కొన్నారు. గూగుల్ రూ.1.33 లక్షల కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ రూ.1.36 లక్షల కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ రూ.1.06 లక్షల కోట్లు, రిలయన్స్ రూ.43 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించారు.
రెన్యూ సంస్థను కూడా తన పోస్టులో పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో ఇప్పటికే వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయని తెలిపారు. మరోవైపు వైసీపీ హయాంలో పెట్టుబడులు, అభివృద్ధికి సంబంధించిన రికార్డును ప్రశ్నిస్తూ తన పోస్టులో ఖాళీ మ్యాప్, బర్నాల్ ట్యూబ్ చిత్రాన్ని ఉంచారు. పారిశ్రామిక ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్లు) దాఖలు చేస్తూ, ఆ తర్వాత వాటి ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ఇకనైనా పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని జగన్‌కు సవాల్ విసిరారు. చర్చకు వస్తారా? లేక బర్నాల్ పంపించాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ పోస్టుకు ‘క్రెడిట్చోర్ జగన’ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.




















