- క్షేమంగా ఏడుగురు ఏటిమొగ మత్స్యకారులు
- అధికారులు పనితీరు అభినందనీయం
- ఉప్పాడ మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న ముమ్మర గాలింపు చర్యలు
- కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ రాశాం
- బంగ్లాదేశ్, మయన్మార్ సహకారానికి చర్యలు
- మత్స్యకారుల ప్రాణరక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
- వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): కాకినాడ జిల్లా ఏటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లి ఇంజిన్ వైఫల్యంతో సముద్రంలో నిలిచిపోయిన బోటు సురక్షితంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకోవ డం సంతోషకరమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డ్రైవర్‌తో సహా ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడం వారి కుటుంబసభ్యులకు ఎంతో ఊరటనిచ్చింద న్నారు. ఏటిమొగకు చెందిన సెరు రామలక్ష్మి పేరుతో నమోదైన యాంత్రిక మత్స్యకార బోటు ఈ నెల 23వ తేదీ రాత్రి ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉప్పాడ తుని తీరంలోని కృష్ణాపురం సమీపంలో నిలిచిపోయిందని వివరించారు. తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోటు నుంచి డ్రైవర్ దమ్ము అప్పారావు సమాచారం అందించడంతో అధికారు లు వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు.
అత్య వసర ఫోన్ కాల్ అందిన వెంటనే స్పందించిన అధి కారుల పనితీరు అభినందనీయమని పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలోనూ వాకలపూడి ఇన్స్పెక్టర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కోస్టార్డ్, నౌకాదళ అధికారులకు సమాచారం చేరవేయడం తోపాటు మత్స్యశాఖతో సమన్వయం చేసుకోవడం ప్రశంసనీయమన్నారు. సముద్రపు నీటి లోతు తక్కువగా ఉండటంతో భారీ నౌకల రాకకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ బోట్ల యజమానుల సంఘం సహకారంతో సహాయక ప్రయత్నాలు చేపట్టారని వివరించారు. ఈ నేపథ్యంలో వేగంగా స్పందిం చిన కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, సంబంధిత సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఉప్పాడ మత్స్యకారుల గల్లంతుపై ప్రత్యేక దృష్టి
మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడలోని సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ నెల 4న రెండు బోట్లలో పారాదీప్ వైపు చేపల వేటకు వెళ్లగా, ఒక బోటు 18న తిరిగి వచ్చిందని వివరించారు. మరో బోటులోని మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో 19న ఫిర్యాదు అందగా అప్పటి నుంచి సంబంధిత శాఖల సమన్వయంతో గాలింపు కొనసాగుతోందని తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశామని తెలిపారు. వారి ఆచూకీ గుర్తించేందుకు అవసరమైన సహకారం కోరడంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల సముద్ర జలాల వైపు వెళ్లి ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు.
కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా ఆయా దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత తీర రక్షక దళం, నౌకాదళం, ఒడిశా అధికారులు, రాష్ట్ర మత్స్యశాఖ సమన్వయంతో గాలింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. మత్స్యకారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. చేపల వేటకు వెళ్లే ముందు బోట్ల ఇంజిన్లు, ట్రాన్స్పాండర్లు, సమాచార వ్యవస్థలు, ఇతర రక్షణ పరికరాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. మత్స్యకారుల ప్రాణరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.



















