- స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుపై లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ హర్షం
- మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన సొసైటీ ప్రతినిధులు
- మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామని మంత్రి ఉద్ఘాటన
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుచేసి స్వర్ణకారులను ఆదుకుంటామని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. ఈ మేరకు కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి నారా లోకేష్‌ను మంగళగిరికి చెందిన లక్ష్మినరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కలిసి గురువారం కృతజ్ఞతలు తెలియేజేశారు. కేట్ కట్ చేయించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మంత్రిని శాలువాలతో సత్కరించారు. స్వర్ణకారుల 60 ఏళ్ల కలను మంత్రి నారా లోకేష్ నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి చొరవతో దేశంలోనే మూడో స్వర్ణకార కార్పొరేషన్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. గతంలో మంగళగిరిలో నారా లోకేష్ చేతులమీదుగా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటైంది. ప్రతిపక్షంలో ఉండగానే స్వర్ణకారులకు అవసరమైన వివిధ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి అందరూ కలిసి కూర్చొని విధివిధానాలు రూపొందించాలని కోరారు. మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులతో పాటు పెద్దఎత్తున స్వర్ణ కార్మికులు పాల్గొన్నారు.