- స్టూడియోల నిర్మాణానికి నిర్మాతలు ముందుకు రావాలని పిలుపు
- మంత్రిగా బాధ్యతల స్వీకరణ
అమరావతి: రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ప్రకృతి వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని వెల్లడిరచారు. పర్యాటకశాఖ మంత్రిగా సచివాలయం రెండో బ్లాక్‌లో కందుల దుర్గేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. అదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రజానీకం వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.
కోనసీమ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సినిమా షూటింగ్‌లు జరిగాయని, కోనసీమ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్ లకు అనువుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సినిమా షూటింగ్‌లు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని నిర్మాతలకు ఆహ్వానం పలికారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం ఉంటుందని, సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు చేపట్టి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. సినీ రంగానికి ఊతమిచ్చేలా తమ చర్యలు ఉంటాయని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అటు, రుషికొండ ప్యాలెస్ పైనా మంత్రి స్పందించారు. అంత ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టే బదులు పేదలకు ఆసుపత్రి కడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.