- 13,326 పంచాయతీల్లో ఒకే రోజు నిర్వహణ
- రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న కోటి మందికిపైగా ప్రజలు
- రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి పనులకు తీర్మానాల ఆమోదం
- 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణం కనిపించింది. ఊరూరా ఒకే రోజు గ్రామసభలు నిర్వహించారు. 13,326 పంచాయతీల్లో ఉదయం నుంచే గ్రామసభలు విజయవంతంగా మొదలయ్యాయి. రికార్డు స్థాయిలో రూ.4500 కోట్లు విలువైన పనులకు ఈ గ్రామ సభల్లో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో మధ్యాహ్నం నుంచి గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఉదయం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.38.46 లక్షల విలువైన 43 పనులకు ఆమోదం తెలిపారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తితో… పారదర్శకతతో
పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లోనూ ఒకే రోజు గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో సభలు నిర్వహించారు. వీటిలో కోటి మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. తమ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు తీర్మానాలు చేసుకొని ఆమోదించుకున్నారు. రూ.4500 కోట్లు విలువైన పనులకు నేటి గ్రామ సభల్లో ఆమోదం లభించింది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో కోటి మందికిపైగా ప్రజలు భాగస్వామ్యంతో రూ.4,500 కోట్లు విలువైన పనులకు ఆమోదం చేసుకోవడం ప్రపంచ స్థాయి రికార్డుగా నిలుస్తుంది.
ఈ గ్రామ సభల ద్వారా 87 రకాలైన పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించింది. 9 కోట్ల పని దినాలతో, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన జరుగుతుంది. పంచాయతీ పరిధిలోని వారంతా కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకొనేలా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, పారదర్శకంగా నిధులు వెచ్చించుకొనేలా గ్రామ సభలను నిర్వహించారు.