- రామోజీ ఫిల్మ్‌సిటీ స్మృతివనంలో అంత్యక్రియలు
- స్వయంగా పాడె మోసిన తెదేపా అగ్రనేత చంద్రబాబు
- హాజరైన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, అభిమానులు
ఇక సెలవు! అంటూ అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా ఆయన అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల ‘జోహార్ రామోజీరావు’ నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.
అమరావతి (చైతన్య రథం): మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో విషణ్ణ వదనాల మధ్య ఘనంగా ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అక్షర యోధుడి అంతమయాత్ర ప్రారంభమైంది. కడపటి చూపుతో కన్నీరు మున్నీరైన కుటుంబీకులు, మనుమడు సంజయ్ నివాళి అర్పించన అనంతరం పెద్దఎత్తున అంతిమయాత్ర మొదలైంది. రామోజీకి జోహార్లు పలుకుతూ, రామోజీ గ్రూప్ సంస్థల ప్రధాన కార్యాలయాల మీదుగా అంతమ యాత్ర సాగింది. స్మృతివనం వరకూ సాగిన అంతిమయాత్రలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవ, సాయిప్రసాద్, ఆర్పీ సిసోడియా హాజరై లాంఛన ప్రక్రియను పూర్తి చేశారు. అంత్యక్రియలకు హాజరైన తెలుగుదేశం అగ్రనేత చంద్రబాబు నాయుడు స్వయంగా రామోజీరావు పార్దివ దేహాన్ని ఉంచిన కాడె మోశారు. రామోజీ పార్దివ దేహం స్మృతివనం వద్దకు చేరగానే గాలిలోకి తుపాకులు పేల్చి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామోజీరావు కుమారుడు, ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్ తండ్రి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అశ్రునయనాలతో కుటుంబసభ్యులు కడపటి వీడ్కోలు పలికారు. జీవన మార్గదర్శికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, భాషాభిమానులు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు అంతిమ సంస్కారాల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, సుజనాచౌదరి, రఘురామకృష్ణరాజు, తెలంగాణ మంత్రి తుమ్మల, చింతమనేని ప్రభాకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, పట్టాభి, తుమ్మల, జూపల్లి, సీతక్క, ఎర్రబెల్లి, పోచారం, నామా నాగేశ్వరరావు, అరికపూడి గాంధీ, నలమోతు భాస్కర్ రావు, వేం నరేందర్ రెడ్డి, వెనిగండ్ల రాము, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, వి.హనుమంతరావు, కేఆర్ సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత సురేష్ బాబు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. చెరుకూరి రామోజీరావు (88) శనివారం ఉదయం తెల్లవారుజామున అస్తమించడం తెలిసిందే. గుండె సంబంధిత సమస్యతో ఇబ్బందిపడిన ఆయనను హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్చడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50కు తుదిశ్వాస విడిచారు.
రామోజీ ప్రస్థానం:
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న జన్మించారు. గుడివాడలో విద్యాభాస్యం కొనసాగింది. చిరు ఉద్యోగిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన, చిన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం ప్రకటనల రంగంలో పని చేసి 1962లో హైదరాబాద్ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ స్థాపించారు. మధ్య తరగతి కుటుంబాల్లో పొదుపు ఆవశ్యకతకు మార్గదర్శి ఎంతో బలం చేకూర్చింది. 1969లో అన్నదాత పత్రిక ప్రారంభించి రైతు సమస్యలు, సాగురంగం ఇబ్బందులు, మెళకువలను ముద్రించేవారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో స్థాపించిన ఈనాడు’ పత్రిక సంచలనాలను సృష్టించింది. ప్రాంతీయ దినపత్రికల చర్రితలో ‘ఈనాడు’ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. క్రమంగా హైదరాబాద్ ఎడిషిన్‌తో పాటు జిల్లాల ఎడిషన్‌లూ ప్రచరించి సామాజిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయింది. సినీ ప్రేమికుల కోసం రామోజీరావు ‘సితార’ పత్రిక ప్రారంభించారు. భాషా ప్రేమికుల కోసం ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికలూ తీసుకొచ్చారు. ‘ప్రియా ఫుడ్స్’ పేరిట పచ్చళ్ల వ్యాపారాన్ని విజయవంతం చేశారు. 1983లో ‘ఉషాకిరణ్ మూవీస్’ సంస్థ ఏర్పాటు చేసి, ఈ బ్యానర్‌లో అనేక చిత్రాలను నిర్మించారు.
ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ని రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామ పరిధిలో విస్తరించారు. 1990లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ ప్రారంభించారు. ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో పలు ప్రాంతీయ ఛానళ్లను ప్రారంభించి, 2002లో ‘రమాదేవి పబ్లిక్ స్కూల్’ను ఏర్పాటు చేశారు. పేపర్, టీవీ మీడియాలోనే కాకుండా `డిజిటల్ మార్కెట్‌లోకి విస్తరించేందుకు ఈటీవీ భారత్ పేరిట మొబైల్ న్యూస్ యాప్‌ను తీసుకొచ్చారు. అనేక రంగాల్లో సేవలందించిన రామోజీ రావును పలు పురస్కారాలు వరించాయి. మీడియా రంగంలో ఇచ్చే అతి ప్రతిష్టాత్మకమైన బిడి గోయెంకా అవార్డు రామోజీరావుకు దక్కింది. 2016లో కేంద్రం ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు.