- బాలల హక్కుల పరిరక్షణకు సంక్షేమ కార్యక్రమాలు
- బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
- సింగరాయకొండలో డిగ్రీ కళాశాల ప్రారంభం
- తల్లిదండ్రులు లేని పిల్లలు వసతిగృహాల్లో భోజనం
- బంగారు బాల్యం`బంగారు ప్రకాశానికి కృషిచేయాలి
- సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
- ఒంగోలు రిమ్స్‌లో ప్రత్యేక వర్క్‌షాప్ ప్రారంభం
ఒంగోలు(చైతన్యరథం): బాలికల విద్యకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధా న్యం ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో బాలల హక్కులపై ‘‘బంగారు బాల్యం’’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక వర్క్ షాప్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల క్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల బంగారు భవిష్యత్ వైపు ప్రకాశం జిల్లా 100 శాతం సాధన దిశగా అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
నోబెల్ గ్రహీతకు ప్రత్యేక కృతజ్ఞతలు
సామాజిక మాధ్యమాల్లో వచ్చే సంఘటనలు, బాల్యం, బాలల హక్కులు, బాల్యం విలువను తెలియజేస్తూ చైతన్యం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను సమ్మిళితం చేసి ఆ ఫలాలు నిరాదరణకు గురైన బాల బాలికలకు అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషిని మనతో పంచుకోవడానికి జిల్లాకు వచ్చిన నోబుల్ గ్రహీత కైలాష్ సత్యార్థికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తుచేశారు.
పెళ్లి ఆప్షన్ కాకుండా విద్య ఆప్షన్‌కు చర్యలు
నేడు బాలికలపై అత్యాచారాలు, సమాజంలో ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల పేదరికం, విద్య లేకపోవడం, పిల్లలపై నిరాదరణ, బాల్య వివాహాలు వంటి పరిస్థితుల్లో బాలికలను విద్యావంతులను చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాల లు నడుపుతున్నట్లు వివరించారు. ఎవరైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలను గుర్తించి వారికి విద్యను అం దించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్ తర్వాత చాలామంది ఆడపిల్లలకు వివాహాలు చేస్తున్నారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సింగరా యకొండలో డిగ్రీ కళాశాలను కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. పెళ్లి అనే ఆప్షన్ కాకుండా విద్య అనే ఆప్షన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు చెప్పారు.
తల్లిదండ్రులు లేని వారి కోసం ‘అనురాగం’ కార్యక్రమం
అనురాగం అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి తల్లిదండ్రులు లేని వారికి కూడా వసతిగృహాల్లో భోజన వసతి కల్పిస్తునట్లు వివరించారు. సమాజంలో నిరాదరణకు గురైన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. మన జిల్లాలోనే బంగారు బాల్యం అనే పేరుతో వినూత్నంగా ప్రారంభించిన బంగారు బాల్యం కార్యక్రమాన్ని గ్రామస్థాయి కమిటీలు నిబద్ధత, అంకిత భావంతో పనిచేసి ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రకా శం జిల్లాను బంగారు బాల్యం, బంగారు ప్రకాశం అనే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
అంతకుముందు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మాతృభాష అమ్మతనానికి, ఆత్మగౌరవానికి ప్రతిరూపం. స్పష్టమైన భావ వ్యక్తీకరణ, మానసిక వికాసం మాతృభాషతోనే సాధ్యం. మాతృభాష మనకు కీర్తి ప్రతిష్ట లు, ప్రశంసలు తెచ్చిపెడుతుంది. మాతృమూర్తిని గౌరవిద్దాం, మాతృభాషను ప్రోత్సహి ద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ పీడీ మాధురి, చదలవాడ పశుక్షేత్రం ఉప సంచాలకులు రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.