- ఐదేళ్లలో చేయనివి 100 రోజుల్లో చేసి చూపించాం
- దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం
నిడదవోలు: పేదల కన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం నిడదవోలు రూరల్ మండలం డి.ముప్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్ర మంలో మంత్రి పాల్గొన్నారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుని వారు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇంటిపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను మంత్రి అతికించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు, నేతలు వచ్చి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదని, సాక్షాత్తు ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని మెచ్చుకుంటున్నారన్నారు.
ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు విశ్వసించినందువల్లే భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారని ఆనందం వ్యక్తం చేశా రు. గత ప్రభుత్వం పనితీరు బాగోలేదు కాబట్టే ఇంటికి పంపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయని పనులను కూటమి ప్రభుత్వం కేవలం నెలరోజుల్లోనే చేసి చూపించిందన్నారు. ప్రజల్లో వెలుగులు నింపేందుకు దీపావళి రోజు నుండే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఎంపీటీసీ ఎస్.సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి దుర్గేష్, ఎంపీడీవో శామ్యూల్, తహసీల్దార్ బి.నాగరాజు నాయక్, సర్పంచ్ నాగిరెడ్డి నాగదేవి, ఉప సర్పంచ్ బి.బ్రహ్మాజీ, స్థానిక నాయకులు వి.సూర్యారావు, ఎం.దుర్గారావు, రంగా రమేష్, పాల వీరాస్వామి, మేడిచర్ల మాధవరావు, పెన్నాడ యజ్జేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నెలరోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ప్రారంభం
నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్-14,17 బాలబాలికల క్రీడాకారుల ఎంపిక సోమవారం ఉదయం నిడదవోలు గవర్నమెంట్ బాలుర హైస్కూల్‌లో ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిభ కలిగిన క్రీడాకారుల సమా చారాన్ని సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు, పీడీల ద్వారా తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నెలరోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలుర హైస్కూల్ హెచ్‌ఎం గురునాథ్, విద్యాకమిటీ చైర్మన్ సూరభ్, మండల పీడీలు, ఉపాధ్యాయులు, పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్, బీజేపీ మండల అధ్యక్షుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యశిబిరం పరిశీలన
నిడదవోలులో స్వచ్ఛత హీ సేవ-2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. వైద్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గ ప్రజల రుగ్మతలను, ఇతరత్రా వైద్య సమస్యలను నయం చేసేందుకు స్థానిక వైద్యులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వివిధ విభాగాల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వచ్చారని మంత్రి తెలిపారు. అనంతరం ఆరోగ్య సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. దేశాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునేందుకు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో నిడదవోలు పీహెచ్‌సీ వైద్యులు పద్మశ్రీ, సూపరింటెండెంట్ ఆలీ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.