- ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ శంకుస్థాపన
- న్యాయమూర్తుల అతిథిగహాలకు భూమిపూజ
- నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ
- హాజరైన ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
మంగళగిరి (చైతన్య రథం): అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రూ.165 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ నిర్మాణం చేపట్టనున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. మొత్తం 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకాడమీ నిర్మాణం చేపడుతున్నారు. ఒకేసారి 120మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చేలా రూపకల్పన చేశారు. 500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆడిటోరియం, జీ ప్లస్ 8 అంతస్తులతో భారీ హాస్టల్ బ్లాక్ నిర్మించనున్నారు. మరోవైపు అమరావతిలో హైకోర్టు జడ్జిల అతిథిగృహానికి సీజేఐ శంకుస్థాపన చేశారు. రూ.69.4 కోట్ల వ్యయంతో 50 వేల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టనున్నారు.
జడ్జీల నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ
అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్ల వ్యయంతో 33.2 ఎకరాల విస్తీర్ణంలో 36మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో నివాస గృహాలను నిర్మించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 13 బంగాళాలను నిర్మించేందుకు తగిన స్థలాన్ని కేటాయించారు. ప్రతి నివాస గృహాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ నమూనాలో నిర్మించారు. న్యాయమూర్తుల అవసరాలకు అనుగుణంగా ఆఫీసు గది, వెయిటింగ్ హాల్ తదితర వసతులతో గృహాలను సమగ్రంగా రూపొందించారు. బీఎసఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆవిష్కరించారు. అనంతరం జడ్జిల బంగ్లాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎస్.వి.ఎస్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్యామలరావు, సురేష్‌కుమార్, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్.పి. వకుల్ జిందాల్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఒక నివాస గృహాన్ని సందర్శించారు.














