- ఎన్డీఏ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు
- నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటన
- భార్య వసుంధరతో కలిసి నామినేషన్ వేసిన బాలయ్య
- భారీ సంఖ్యలో తరలి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు
హిందూపూర్: హిందూపూర్ మరోసారి గెలిచి హ్యట్రిక్ సృష్టిస్తామని టీడీపీ అగ్రనాయకుడు నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనమంతా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపూర్‌లో బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్‌ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్‌కు భారీ సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. కాగా, బాలయ్య ఇప్పటికే హిందూపూర్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులను నిర్మించినట్లు పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా సొంతంగా క్యాంటీన్లు ఏర్పాటు చేసి హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తన కుటుంబం అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన.. ఆ అభిమానంతోనే తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో తనను గెలిపించాలని బాలకృష్ణ హిందూపురం ఓటర్లను అభ్యర్థించారు.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంను ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ హిందూపురం అభివృద్ధి కోసం పని చేస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 20, 30 ఏళ్లు వెనుకబడిపోయిందన్నారు. విద్య, వైద్యం అన్ని విషయాల్లోనూ నష్టం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పెట్టేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ హయాంలోనే తూముకుంటలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేశామని బాలయ్య తెలిపారు. హిందూపురంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.