- ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనే మా పిలుపునకు అనూహ్య మద్దతిచ్చారు
- పాలకులం కాదు…సేవకులం అనేది మా విధానం
- పాలకుడు ఎలా ఉండకూడదో చెప్పేందుకు జగన్ పాలన ఒక కేస్‌స్టడీ
- ఎన్నికల్లో ఓడిరచడం వేరు, ఇక నువ్వు వద్దేవద్దని ఓటేయటం వేరు
- జగన్ వల్ల దెబ్బతినని వర్గం, వ్యవస్థ లేదు
- కూటమి కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషి వల్లే ఈ ఫలితాలు
- ఎన్డీఏలోనే ఉన్నాం, ఉంటాం
- అఖండ విజయంపై ప్రజలకు, భాగస్వామ్య పక్షాలకు, మీడియాకు టీడీపీ అధినేత ధన్యవాదాలు
అమరావతి (చైతన్యరథం): సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- జనసేన-బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునకు ప్రజలు అనూహ్య మద్దతిచ్చారన్నారు. కూటమి నేతలు, కార్యకర్తల సమష్టి కృషి వల్లే ఈ విజయం దక్కిందన్నారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని…ఇది ఒక ఉన్నతమైన బాధ్యత అని స్పష్టం చేశారు. ఫలితాలు వెలువడిన అనంతరం మొదటి సారి ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ…నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.. అన్ని రంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. మా ధ్యేయం ఒక్కటే ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలి. ఎన్ని త్యాగాలైనా చేసైనా భవిష్యత్ తరాల కోసం ముందుకెళ్లానుకుని నిర్ణయించుకున్నాం. నేను ఇప్పటికి 10 ఎన్నికలు చూశాను…ఎన్నో సమీక్షలు నిర్వహించి ఎన్నికలకు వెళ్లాం. భూమ్మీద ఎవరూ శాశ్వతం కాదు…దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతం. సరైన పంథా లేని పార్టీలు ఎన్నో కనుమరుగయ్యాయి. ఈ తీర్పుతో రాష్ట్రంలో అందిరికీ స్వాతంత్య్రం, స్వేచ్ఛ లభించిందని చంద్రబాబు అన్నారు.
కసిగా వచ్చి ఓట్లేశారు
ఇంతటి చారిత్రాత్మక ఎన్నికలు నా జీవితంలో చూడలేదు. ఈ ఎన్నికల్లో ఎక్కడో విదేశాల్లో ఉండే వ్యక్తులు లక్షలు ఖర్చు పెట్టుకని వచ్చి మరీ ఓటు వేశారు. పక్క రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లిన వారు కూడా సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ప్రజల నిబద్ధతను ఎలా అభినందించాలో, ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల కంటే టీడీపీ చరిత్రలో, అసలు ఏపీ చరిత్రలోనే ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. టీడీపీ స్థాపించినప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 200 సీట్లు వచ్చాయి. 1994లో ప్రతిపక్షానికి కొన్ని చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. వాటన్నింటినీ కూడా ఇప్పుడు అధిగమించి నేడు ఇంతటి విజయం చేకూరడానికి కారణం గత ఐదేళ్లలో ప్రజలు అనుభవించిన బాధలే. ఐదేళ్లుగా ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. బతకడంపై ఆశలు కోల్పోయారు. దాంతో ఒక కసితో భారీగా తరలివచ్చి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ ఎన్నికల్లో కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. ఇందులో టీడీపీకి 45.60 శాతం, వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయి. ఎప్పుడూ లేనంతగా 95 వేల మెజారిటీ టీడీపీ అభ్యర్థులకు వచ్చింది. గతంలో కుప్పం, సిద్ధిపేట మెజారిటీల్లో పోటీ పడేవి. కానీ ఇప్పుడు గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేల మెజారిటీ దాటాయని చంద్రబాబు చెప్పారు.
మా కార్యకర్తలను హింసించారు
అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనాన్ని ప్రజలు క్షమించరనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం. ప్రజలు చెప్పిన గుణపాఠం ప్రస్తుత పాలకులకు మాత్రమే కాదు…అవినీతి, అహంకారంతో ముందుకు వెళ్లే విధ్వంసకారులకు ఎప్పుడైనా ఇదే జరగుతుంది…ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా. మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కంటినిండా నిద్రలేని పరిస్థితులు చూశారు. మనిషిని హింసిస్తూ, ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని నినదించిన చంద్రయ్య లాంటి వారి త్యాగాలు ఈ విజయం వెనుక ఉన్నాయి. ఆ త్యాగాల ఫలితమే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. మీడియా కూడా ఐదేళ్లు గా ఎన్నో ఇబ్బందులు పడిరది. కోర్టుల చుట్టూ తిప్పిన ఇబ్బందులు, సీఐడీ ఆఫీసుల చుట్టూ తిప్పిన ఘటనలు తలచుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి. పవన్ కళ్యాణ్ ను కూడా స్వేఛ్చగా ఉండనివ్వలేదు. విశాఖ పర్యటనకు వెళ్తే నగరంలోకి రాకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. కేసులు పెడితే ఎందుకు కేసు పెట్టావని అడిగితే సమాధానం చెప్పకుండా అరెస్టు చేసి తర్వాత వివరాలు చెప్తామంటూ పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని చంద్రబాబు విమర్శించారు.
పాలకులం కాదు..సేవకులం
ప్రజలు మాకు ఇచ్చింది అధికారం అనుకోవడం లేదు…బాధ్యతగా తీసుకుంటున్నాం. పాలకులం కాదు..సేవకులం అనే నినాదానికి శ్రీకారం చుడుతున్నాం. సూపర్-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమికి బీజం వేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బీజేపీ కూడా కూటమిలో భాగమైంది…మూడు పార్టీలు ఎక్కువ తక్కువ అని లేకుండా, భేషజాలు లేకుండా పని చేశాయి. కేంద్ర నాయకత్వంతో కలిసి గట్టిగా పని చేశాం. 5 ఏళ్ల జగన్ పాలనలో 30 ఏళ్లకు సరిపడా విధ్వంసం జరిగింది. అప్పులు ఎంత చేశారో తెలీదు. సహజ సంపదలైన ఇసుక, మైన్, గనులు అన్నింటినీ ఇష్టానుసారంగా దోచేశారు. బోరుబావులు ఇంకిపోతాయని తెలిసి కూడా పొలాల పక్కన ఇసుకను తవ్వేశారు. ప్రాణభయంతో రైతులు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. గాడితప్పిన వ్యవస్థలను పునరుద్ధరిస్తాం. 1999 నుండి విద్యుత్ రంగంలో మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్యుత్ అందించాం. కానీ ఈ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ రంగంపై అప్పులు తెచ్చి వాటినీ దుర్వినియోగం చేశారు. విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
నా ప్రతిజ్ఞను ప్రజలు నిజం చేశారు
అసెంబ్లీలో నన్ను, నా కుటుంబ సభ్యులను అవమానించారు. నా జీవితంలో ఎప్పుడూ అంతలా బాధపడలేదు. నాపై బాంబు దాడి జరిగినా వీరోచితంగా ఎదుర్కొన్నా తప్ప భయపడలేదు. కౌరవసభలో ఉండనని ఆ నాడు చెప్పాను…అది చెప్పడానికి కూడా కనీసం అసెంబ్లీలో నాకు మైకు ఇవ్వలేదు. గౌరవ సభగా మార్చిన తర్వాతే సభకు వస్తానని చెప్పాను. ఆ నాడు నేను చేసిన ప్రతిజ్ఞను ప్రజలు నిజం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు…గెలిచినప్పుడు ఎగిరిపడలేదు. ఓడిపోయినప్పుడు బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషించాం. గెలిపించినప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించాము. మేము ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నాం. నా మాటను, గౌరవాన్ని నిలబెట్టిన ప్రజల రుణం తీర్చుకుని ప్రజల ఆశల మేరకు పని చేస్తాం. నేడు ఓట్లు వేసిన ప్రజలు….రేపు కూడా సహకరించాలని కోరుతున్నా. ప్రజల సహకారం, భాగస్వామ్యంతో పాలన సాగిస్తామని చంద్రబాబు అన్నారు.
దేశంలోనే జగన్ పాలన ఒక కేస్ స్టడీ
కూటమి విజయంపై భాగస్వామ్య పక్షాలకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రధాని మోదీ, కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మూడు పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి కార్యకర్త, నాయకుడు బ్రహ్మాండంగా పని చేశారు. మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమష్టి కృషి. పాలకుడు ఎలా ఉండకూడదో…ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడో జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ. పాలకులంటే ఎలా ఉండాలో చాలా మంది పని చేశారు…పాలకుడు ఎలా ఉండకూడదో జగన్ చేసి చూపించాడు. ఎన్నికల్లో చాలా సందర్భాల్లో…చాలా మందిని ప్రజలు ఓడిరచారు. కానీ జగన్ విషయంలో ఇక నువ్వు వద్దే వద్దు అని ప్రజలు బలమైన తీర్పును ఇచ్చారు. నేడు ఎన్డీఎ మీటింగ్ కోసం ఢల్లీి వెళుతున్నాను. మేము ఎన్డీఏతోనే ఉన్నాం, ఉంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.