హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని ఒక భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగి నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక 9 మంది మృతిచెందారు. మృతుల్లో నాలుగు రోజుల పసికందుతో పాటు ఇద్దరు మహిళలు
ఉన్నారు. ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
భవనంలోని గ్రౌండ్‌ప్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం… వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనలకు గురయ్యారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఘటనాస్థలంలో జీహెచ్‌ఎంసీ, ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారకస్థితిలో ఉన్నారని… వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఒకటి,రెండవ అంతస్తులో ఉన్న వాళ్లే మృత్యువాత పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. మూడు, నాలుగు అంతస్తులో ఉన్నవాళ్లు సేఫ్ గా ఉన్నారన్నారు. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని సందర్శించి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భవన యజమాని రమేష్ జైస్వాల్‌కు ప్లాస్టిక్ తయారుచేసే పరిశ్రమ ఉన్నట్లుగా గుర్తించారు. 5 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో 150కి పైగా కెమికల్ డ్రమ్ములు నిల్వచేశారు. మృతులను అజం (58), రెహానా (50), సమీన్ (26), తహూరా (35), తూబ (6), తరూబా (13), జకీర్ హుస్సేన్ (66), నికత్ సుల్తానా (55), హసీబ్ (32)గా గుర్తించారు.