- టీడీపీ సభ్యులుగా యనమల, పట్టాభి, అశోక్ బాబు
- జనసేన తరఫున వరప్రసాద్, శశిధర్, శరత్లకు కమిటీలో చోటు
- ఈ నెల 13న సమావేశం కానున్న కమిటీ
అమరావతి: ఏపీలో జగన్ రెడ్డి పాలనకు తెర దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీలు ఒకే మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల నిర్ణయించాయి. ఈ మేరకు శనివారం ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్… జనసేన పార్టీ తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రూపకల్పనపై ఈ కమిటీ ఈ నెల 13న సమావేశం కానుంది. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పాయింట్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లింది. పొత్తు అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ ‘షణ్ముఖ వ్యూహం’ పేరిట మరో 6 అంశాలు ప్రతిపాదించారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ పవన్ ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజా మేనిఫెస్టోకు రూపకల్పన చేయనుంది.