- వంద జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్
- ఇక నిరాటంకంగా పనులు
- పనులు ఆపేసి, రాజధానిని పాడు పెట్టిన జగన్‌రెడ్డి
అమరావతి, చైతన్యరథం: ఎన్డీయే కూటమి గెలిచిన వెంటనే అమరావతికి కొత్తకళ వస్తోంది. అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో ఐదేళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. దాదాపుగా వంద జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమయింది. 109 కి.మీ నిడివిలోని 6818 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. చంద్రబాబు మొదటి విడత పాలనలో రాజధానిగా అమరావతిని ఖరారు చేసి.. భూ సమీకరణ చేసి.. ఎన్జీటీలో పిటిషన్లను అధిగమించి పనులు ప్రారంభించే సరికి చాలా కాలం గడిచిపోయింది. ఈ సారి ఎలాంటి సమస్యలు లేవు. ఇప్పటికే పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే రెండు, మూడేళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు సంస్థలు, కేంద్ర సంస్థలకు కూడా పెద్ద ఎత్తున స్థలాలు కేటాయించారు. వారంతా.. వీలైనంత త్వరగా నిర్మాణాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతు ఉండే అవకాశం ఉండటంతో రెండు, మూడేళ్లలో అమరావతికి ఓ రూపు వస్తుందని.. అభివృద్ధికి హద్దే ఉండదన్న ఓ నమ్మకం బలపడుతోంది.
ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మూలబడిన విషయం తెలిసిందే. ఒకప్పుడు నిలువెత్తు నిర్మాణాలు.. ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొన్న అమరాతి ప్రాంతం జగన్ హయాంలో మాత్రం నిలువునా శిథిలమైపోయింది. జగన్‌రెడ్డి తన సైకో మనస్తత్వంతో అమరావతిపై క్షక్ష సాధించాడు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని పాడుపెట్టాడు. నిర్మాణంలో ఉన్న భవనాలను, రోడ్లను అలాగే వదిలేశాడు. వైసీపీ మూకలు తెగబడి అమరావతి నిర్మాణ సామగ్రిని దొంగలించుకొని వెళ్లారు. రోడ్లను తవ్వేశారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా కనీసం ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా పాడు పెట్టారు. మొత్తం అమరావతిని ఒక చిట్టడివిలా మార్చేశారు. అయితే..రాష్ట్రంలో ప్రజలు అధికారం మార్పిడి చేయడం తో ఇప్పుడు రాజధానిలో కొత్త కళ కనిపిస్తోంది. ఎటు చూసినా.. పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, అడవిని తలపిస్తున్న చెట్లను కూడా తొలగించారు.
మరోవైపు యుద్దప్రాతిపదికన.. స్మారక నిర్మాణాలను శుభ్రం చేస్తున్నారు. అప్పట్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసి అలంకరిస్తున్నారు. ఇక, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెం లోని సీఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. తర్వాత అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయ భవనాలను, ఎంఎల్‌ఏల క్వార్టర్లు, ఏపీ ఎన్జీవోల నివాసం భవనాలు సముదాయాలను పరిశీలించారు. అదేవిధంగా హైకోర్టు ప్రాంతం తదితర చోట్ల సిఎస్ పరిశీలన చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ఇక్కడి రైతులతో అధికారికంగా ఆయన భేటీ అవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా నిర్మాణ పనులను కూడా సాధ్యమైనంత వేగంగా చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ఇతరత్రా సదుపాయాలను కూడా వచ్చే ఆరు మాసాల్లోనే పూర్తి చేసి.. కోర్టుకు అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంది.
సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు. రాజధాని అవసరాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా పనులు చేస్తామన్నారు. జంగిల్ క్లియరెన్స్ తర్వాత రాజధానిలో రహదారులు బాగు చేస్తామన్నారు. చివరి దశలో ఉన్న భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కాగా సోమవారం రాజధాని శిబిరాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సందర్శించారు. జగన్ ఓటమికి అమరావతి ఉద్యమం కూడా కారణమని అన్నారు. రాజధాని తరలించాలని చూసిన జగన్‌కు జనం బుద్ది చెప్పారన్నారు. వైసీపీ త్వరలో భూస్థాపితం అవుతుందన్నారు.