- అనవసరమైన ప్రశ్నలతో అపోహలకు గురిచేయొద్దు
- అంతిమంగా సర్వే లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పనే
- నైపుణ్య గణనపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సస్ సర్వే నిర్వహణపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్కిల్ సెన్సస్‌లో భాగంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ ప్రొఫెల్స్ ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుందన్నారు. ఈ ప్రొఫెల్స్ ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని చెప్పారు. తద్వారా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఎడ్యుకేషన్, స్కిల్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. ఇదే సమయంలో యువత, ప్రజలను అపోహలకు గురిచేసే అనవసరమైన ప్రశ్నలు అడగవద్దని స్పష్టంచేశారు. స్కిల్ సెన్సస్ సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని, ఆ దిశగా నైపుణ్య గణన జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని చెప్పారు. నైపుణ్య గణన తరువాత యువతలో స్కిల్ డెవలప్మెంట్ కు చర్యలు చేపడతామని తెలిపారు. ఒకపక్క తమకు ఉద్యోగాలు దొరకడం లేదని యువత అంటున్నారు.
మరోపక్క ప్రఖ్యాత కంపెనీలు నైపుణ్యం ఉన్న యువత దొరకడం లేదు అంటున్నాయి, ఈ రెండు సమస్యలకు సమాధానంగా నైపుణ్య గణన జరగాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన..ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధమైన తర్వాత మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
స్కిల్ సెన్సస్ కోసం రూపొందించిన యాప్‌లో పొందుపర్చిన అంశాలను అధికారులు వివరించారు. యాప్‌లో పలు మార్పులు చెయ్యాలని అధికారులకు లోకేష్ సూచించారు. ఈ సమీక్షలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్, ఉన్నత విద్యశాఖ ఇన్చార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, స్కిల్ డెవలప్మెంట్ ఎండి గుమ్మాల గణేష్ కుమార్, నాక్ ఎడిజి కె.దినేష్ కుమార్, ఎపిసిఎఫ్ఎస్ఎస్ అధికారి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయ వివాదాల్లేకుండా వర్సిటీల్లో పోస్టుల భర్తీకి చర్యలు
న్యాయపరమైన చిక్కులు తొలగించి రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్య శాఖ అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. యూనివర్సిటీల ర్యాంకింగ్స్ మెరుగుదలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని మంత్రి లోకేష్ సూచించారు.