అనంతపురం: రాములవారి ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి రథానికి నిప్పు పెట్టినట్లు గుర్తించామన్నారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడిరచారు. ఈనెల 23 రాత్రి ఆలయ రథానికి నిప్పు పెట్టారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు 24 గంటల్లో కేసును ఛేదించాం. ఎర్రిస్వామిరెడ్డి సోదరులు రూ.20లక్షలు వెచ్చించి 2022లో రథం చేయించారు. దీనికోసం గ్రామస్థుల నుంచి ఎలాంటి విరాళాలు సేకరించలేదు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో జరిగిన గొడవతో రథానికి ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు ఈశ్వర్ రెడ్డి నిప్పుపెట్టాడు. అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు విచారణలో అంగీకరించాడు. అతడు వైసీపీ కార్యకర్త. రథానికి నిప్పు అంశంలో మరెరైనా ఉన్నారా..అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ లోని ఆలయ రథానికి సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడం కలకలం రేపింది. షెడ్డులో మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. అప్పటికే రథం కొంతమేర కాలిపోయింది. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటనా స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కులం, మతం, గొడవలకు సంబంధించి జరిగిన ఘటన కాదని తేల్చారు.