మచిలీపట్నం (చైతన్య రథం): గత ప్రభుత్వం ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దిన చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్తపై పన్ను వేశారే తప్ప… చెత్త తొలగించకుండా రాష్ట్రాన్ని చెత్తకుప్ప చేసేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సమైఖ్య రాష్ట్రంలో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించాం. ఆ కార్యక్రమం నా మనసుకు దగ్గరగా ఉంటుంది. అందరం ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం అభినందనీయం. అక్టోబర్ 2న స్వచ్ఛ సేవకులకు అవార్డులిచ్చి, వారిని అభినందించాలని గతంలో ప్రతిపాదించాం. 2015లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఏపీకి శ్రీకారం చుట్టాం. 2019కి ముందు పట్టణాల్లో డివైడర్లకు రంగులువేసి, పార్కులు అభివృద్ధి చేశాము. కానీ 2019లో భూతంవచ్చి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఎక్కడ చూసినా కుప్పలుగా చెత్తను పెట్టారు.
చెత్తతో సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కంపోస్ట్ ఎరువుల తయారుచేసి పంటలకు ఉపయోగించి ఎక్కడా చెత్త కనబడకుండా చేశాం. పట్టణాల్లో 2.43 లక్షల మరుగుదొడ్లు, 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించి 110 మున్సిపాలిటీలను ఓడీఎఫ్‌గా ప్రకటించాం. గత పాలకుల నిర్వాకం కారణంగా రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పడివుంది. 365 రోజుల్లో ఆ చెత్తంతా తొలగించాలని మంత్రి నారాయణను ఆదేశిస్తున్నా. నాడు గ్రామాల్లో 41.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించాము. 2018లో ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటించాం. 9,538 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాలను నిర్మించాం. కానీ వాటిని గత ప్రభుత్వం వినియోగించుకోకుండా రంగులు వేసుకుంది. విజయవాడ, గుంటూరులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. భవిష్యత్‌లో ఎన్నిప్లాంట్లు అవసరమవుతాయో ఏర్పాటు చేస్తాం. ప్రతి రోజూ విధిగా చెత్తను తొలగిస్తాం. టెక్నాలజీ ఉపయోగించి భవిష్యత్తులో ఎక్కడా చెత్త లేకుండా చేస్తాం. పూడిపోయిన డ్రెయిన్లు డ్రోన్లతో గుర్తించి వదర సమయంలో క్లీన్ చేయించాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు.
మచిలీపట్నంలో…
గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. అనంతరం విద్యార్థులతో కలిసి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి రోడ్లపై పేరుకున్న చెత్తను తొలగించారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించారు. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి మంత్రి కొల్లు రవీంద్ర విన్నవించారు.
మచిలీపట్నంలో…
గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో, స్కూలు విద్యార్థులతో కలిసి రోడ్లు ఊడ్చిన ముఖ్యమంత్రి. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు.
ఉండవల్లిలో..
జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఉండవల్లిలోని సీఎం నివాసంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు.