- థర్డ్ పార్టీ ఏజెన్సీలతో భద్రతా ప్రమాణాలు లోపించాయి
- అనకాపల్లి సెజ్ బాధితులకు తక్షణ సహాయక చర్యలు
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థర్డ్ పార్టీ ఏజెన్సీ విధానం కారణంగానే కంపెనీల్లో భద్రణా ప్రమాణాలు సన్నగిల్లి ప్రమాదాలకు దారితీస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనపై రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్సియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ రియాక్టర్ పేలిన ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయక చర్యల్లో భాగంగా దగ్గరలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప త్రుల్లో చికిత్స అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో థర్డ్ పార్టీ ఏజెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా సన్నగిల్లాయన్నారు.
కార్మిక శాఖ పూర్తిస్థాయిలో నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. విశాఖపట్నంలో దళారీ వ్యవస్థ ఎక్కువ గా ఉందన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్వహణ కూడా పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేయడం జరిగిందని, కేంద్ర నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన రాయితీలు, సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడం జరిగింద న్నారు. ఈ సమస్యలను సరిదిద్దేందుకు అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తూ కార్మిక శాఖలో మార్పు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు.